డిఫ్యూటీ స్పీకర్‌పై ఇండియా దృష్టి
న్యూఢిల్లీ, జూన్ 16: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు దక్కకపోయినా సీట్ల పరంగా బాగా బలపడిన ప్రతిపక్ష ఇండియా కూటమి.. పార్లమెంటులో మోదీ సర్కారును బలంగా ఢీకొట్టే మార్గాలను వెదుకుతున్నది. సాధారణంగా అధికార పక్షం నుంచే లోక్‌సభ స్పీకర్ ఉంటారు. దానివల్ల ప్రతిపక్షానికి సభలో తగిన ప్రాధాన్యం దక్కకపోవచ్చు. గత పదేండ్లలో సభలో ఇలాంటి సందర్భాలు చాలానే కనిపించాయి. దీంతో ఈసారి డిఫ్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.
ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్నా యి. ఈ సమావేశాల్లో కొత్త లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభ స్పీకర్, డిఫ్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈసారి ప్రతిపక్షం తరఫున డిఫ్యూటీ స్పీకర్ అభ్యర్థిని పోటీలోకి దింపాలని ఇండియా కూటమిని నిర్ణయించినట్టు సమాచారం. లోక్‌సభ నిర్వహణ మొత్తం స్పీకర్ నియంత్రణలోనే ఉంటుంది. ఉభయసభల సమావేశంతోపాటు, పలు కమిటీల నియామకంలోనూ ఆయనే సర్వాధికారి. సభలో స్పీకర్ లేని సమయంలో డిఫ్యూటీ స్పీకర్ కీలకపాత్ర పోషిస్తారు. డిప్యూటీ కూడా స్వతంత్రంగానే వ్యవహరిస్తారు. దీంతో ఆ పోస్టుపై విపక్షం కన్నేసిందని సమాచారం.






