విమానాన్ని ఆపిన బాలుడు
న్యూఢిల్లీ, జూన్ 16: ఈ మధ్య కాలంలో విమానాలు గంటలకు గంటలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు యాజమాన్యాల తప్పులతో ఆలస్యమైతే.. మరికొన్నిసార్లు సాంకేతిక సమస్యలతో ఆగిపోతున్నాయి. కానీ, ఓ బాలుడు తనమారాం చేష్టలతో విమానాన్ని ఆలస్యం చేసిన ఘటన కొలంబియాలో జరిగింది. విమానం ఎగిరే సమయంలో సీటు బెల్టులు పెట్టుకోవాలని సిబ్బంది సూచించారు. ఓ పదేండ్ల బాలుడు అందుకు నిరాకరించాడు.
అతడి తండ్రి ఎంత నచ్చజెప్పినా సీటు బెల్టు పెట్టుకొనేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆలస్యమైతుం దని తోటి ప్రయాణీకులు గోల చేయటం చేశారు. చిర్రెత్తుకొచ్చిన పైలట్ వారిని బయటకు తోసేయండి అని అరిచాడు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది ఎంతో మర్యాదపూర్వకంగా ‘నిబంధనల ప్రకారం విమానం పైకి ఎగిరేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోతే.. కిందికి దించేస్తాం’ అని చెప్పారు. ఈ వివాదం ఓ గంటపాటు జరిగింది. చివరకు పోలీసులు విమానంలోకి వచ్చి బాలుడిని, అతడి తండ్రిని కిందికి దింపేయటంతో ఎట్టకేలకు విమానం గాల్లోకి ఎగరింది.






