భారత్ ఎప్పటికీ లౌకిక దేశమే
- ఎన్నికల ఫలితాలు అదే వెల్లడించాయి
ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్
న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు భారత్‌ను లౌకిక గుర్తింపును ప్రతిబింబిస్తుందని నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ పేర్కొన్నారు. కోల్‌కత్తాలోని నేతాజీ సుభాశ్‌చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాలను చూస్తే హిందూ రాష్ట్ర భావనను తిరస్కరిస్తున్నాయని నొక్కి చెప్పారు. రాజకీయంగా ఓపెన్ మైండెడ్‌గా ఉండాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ముఖ్యంగా భారత్‌కు మన రాజ్యాంగం లౌకిక దేశంగా ప్రకటించిందని గుర్తుచేశారు.
భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చాలనే భావన సముచితంగా లేదన్నారు. హిందు దేశంగా భారత్‌కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన బీజేపీ అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో ఓడిపోవడం దీన్ని ధ్రువీకరిస్తుందని తెలిపారు. మహాత్మాగాంధీ, ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఇలాంటి రాజకీయాలు పనిచేయవని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి విచారణ లేకుండానే జైలుకు పంపే బ్రిటీష్ కాలం నాటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు. స్వాతంత్య్రం తర్వాత మార్పు వస్తుందని తాము ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిని అంతం చేయడంలో విఫలమైందని అమర్త్యసేన్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో దీన్ని మరింత ఎక్కువ ప్రోత్సహిస్తోందని సేన్ ఆరోపించారు.






