4 August, 2026 | 1:50 AM

అవయవ దానం చేసి.. మరణానంతరం కూడా జీవించండి

04-08-2026 12:11 AM

పంజాగుట్ట, ఆగస్టు 3 (విజయక్రాంతి): అవయవ దానం ద్వారా మరణానంతరం కూడా మరో ఎనిమిది మందికి జీవం పోయవచ్చని రాష్ట్ర అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ  కోఆర్డినేటర్ డా. భూషణ్ రాజు అన్నారు. నిమ్స్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాలలో సోమవారం నిర్వహించిన 16వ భారతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్రతి మనిషి మరణం అనివార్యమని, అయితే మరణానంతరం శరీర అవయవాలను దానం చేయడం ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఆయన పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తిరిగి కోలుకునే అవకాశం ఉండదని, అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వస్తే గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్లతో పాటు ఇతర అవయవాల ద్వా రా పలువురికి పునర్జన్మ లభిస్తుందని వివరించారు. అపోహలను వీడి అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవయవ దానం పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, పాథాలజీ విభాగం పద్మిని, న్యూరాలజీ విభాగం శైలజ, కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు చెందిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.