లార్డ్స్‌లో అమ్మాయిల టెస్ట్
తొలిసారి క్రికెట్ మక్కా ఆతిథ్యం
ఫేవరెట్‌గా భారత జట్టు
శ్రీచరణి, హ్యార్లీన్ అరంగేట్రం
మహిళల క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌లు జరగడం తక్కువే.కొంతకాలంగా ఐసీసీ అమ్మాయిల రెడ్‌బాల్ క్రికెట్‌కూ ప్రోత్సాహం పెంచింది. ఈ క్రమంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు లార్డ్స్ వేదికగా చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. 142 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి లార్డ్స్ ఒక మహిళల రెడ్‌బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. మరి రికార్డుల పరం గా పైచేయి ఉన్న నేపథ్యంలో ఈ హిస్టారికల్ మ్యాచ్‌లో భారత్ అదరగొడుతుందా ?
జూలై 9, లార్డ్స్: మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిపోయి వారం అవుతోంది. ఈ మెగాటోర్నీలో సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన భారత మహిళల జట్టు ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్‌కు రెడీ అయింది. చారిత్రాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో రెడ్‌బాల్ క్రికెట్ మ్యాచ్ ఆడబోతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో మహిళా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుండడం ఇదే మొదటిసారి.
1976లో రాచెల్ హేహో ఫ్లింట్ నేతృత్వంలో ని ఇంగ్లాండ్ మహిళల జట్టు ఇక్కడ మొదటిసారి పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడిన ఇన్నేళ్లకు తొలిసారి ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టునే ఫేవరెట్‌గా చెబుతున్నారు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో భారత్‌కు ఉన్న అద్భుతమైన రికార్డే దీనికి కార ణం. కాగా హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తోంది. యువ ఓపెనర్ ప్రతికా రావల్ మోకాలి గాయంతో తప్పుకోవ డం ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఆమె స్థానంలో ప్రియా పునియాను తీసుకున్నారు.
ఈ మ్యాచ్ తో తెలుగమ్మాయి శ్రీచరణి, హర్లీన్ డియోల్ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. భారత బ్యాటింగ్ లైనప్‌లో ఇంగ్లాండ్ పిచ్‌లపై జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడంలో స్మృతి కీలకం కాబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రతిభ కనబరిచే ఆల్‌రౌండర్‌గా గుర్తింపున్న దీప్తి శర్మపై అంచనాలున్నాయి.
టెస్టుల్లో సుధీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన ఘనత ఆమె సొంతం. అలాగే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన తెలుగమ్మాయి శ్రీచరణి స్పిన్‌ను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బాటర్లకు సనాలే. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ జట్టుకు నాట్ స్కివర్ -బ్రంట్ కెప్టెన్‌గా ్యవహరిస్తోంది. ఆ జట్టు సీనియర్ ప్లేయర్ టామీ బ్యూమౌంట్‌కు ఇదే చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ఇక ఇంగ్లాండ్‌తో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో రికార్డుల పరంగా చూస్తే భారత మహిళలదే పైచేయిగా ఉంది.
మొత్తం 15 మ్యాచ్‌లలో భారత్ 3 గెలవగా.. ఇంగ్లాండ్ కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.11 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై భారత్‌కు ఓటమి లేని రికార్డుంది. భారత్ ఆడి న 9 టెస్టుల్లో రెండింటిలో విజయం సాధించి, 7 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఇప్పటికే 30 వేల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. యూకే మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. ఈ మ్యాచ్ ప్రారంభానికి గుర్తుగా ఇంగ్లాండ్‌కు చెందిన 50 మంది మాజీ మహిళా క్రికెటర్లు కలిసి లార్డ్స్‌లోని ప్రసిద్ధ ఫైవ్-మినిట్ బెల్ ను మోగించనున్నారు.






