16 July, 2026 | 7:04 PM

భారత యువతది ‘విరాట్ కోహ్లి మనస్తత్వం’

18-04-2024 01:46 AM

l ప్రపంచంలో ఎవరికీ తగ్గేదేలే అనుకుంటారు

l అందుకే భారత్‌నువీడి అంతర్జాతీయ మార్కెట్లకు వెళుతున్నారు

l డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫలాల్ని అందుకోలేకపోతున్నాం

l ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వ్యాఖ్యలు

వాషింగ్‌టన్ ఏప్రిల్ 17: భారత యువతది ‘విరాట్ కోహ్లి మనస్తత్వం’ అని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ అభివర్ణించారు. పలువురు విరాట్ కొహ్లి మనస్తత్వం కలిగిన యువ భారత వాణిజ్యవేత్తలు ‘ప్రపంచంలో నేను ఎవరికీ తక్కువకాదని’ భావిస్తారని, సంతోషంగా భారత్‌లో ఉండేందుకు ఇష్టపడరని చెప్పారు. భారత్‌లోని యువ ఆవిష్కర్తలు మార్కెట్లను సులభంగా చేరుకునే అవకాశాలు కలిగిన సింగపూర్‌కో, సిలికాన్ వ్యాలీకో తరలివెళతారన్నారు. అందుకే ఈ ఇన్నోవేటర్స్ పెద్ద సంఖ్యలో వారి వ్యాపారాల్ని ప్రారంభించేందుకు భారత్‌ను వీడి విదేశాలకు వెళుతున్నారని రాజన్ వివరించారు.

జార్జ్ వాషింగ్‌టన్ యూనివర్సిటీలో ‘2047 నాటికి భారత్ ధనికదేశం :  ఆ స్థాయికి చేర్చేదేమిటి’ అనే అంశంపై జరిగిన ఒక సదస్సులో రఘురామ రాజన్ ప్రసంగిస్తూ ‘అందుకు మేము మధ్యలో (డెమోగ్రాఫిక్ డివిడెండ్ మార్పు ద్వారా ఒనగూడే ఆర్థికాభివృద్ధి) ఉన్నాం, కానీ సమస్య ఏమిటంటే ఫలాల్ని మేము అందుకోవడం లేదు’ అని వాపోయారు. ‘వాస్తవానికి అంతర్జాతీయంగా వారు (భారతీయులు) విస్తరిం చాలని కోరుకుంటున్నారని అన్నారు.

యువతకు ఉపాధి కల్పించలేకపోతున్నాం

ప్రస్తుతం భారత్ 6 శాతం వృద్ధి సాధిస్తున్నా, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫలితాల్ని అందుకోలేకపోతున్నది. అంతకంటే చాలా తక్కువ వృద్ధి రేటుతో చైనా, కొరియాలు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫలాల్ని అందుకున్నాయని రాజన్ తెలిపారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్‌తో ఒనగూడే ఫలితాల్ని సాధించలేకపోవడంతో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని ఆర్బీఐ మాజీ గవర్నర్ వాపోయారు. ప్రసంగానికి ముందు రాజన్ సదస్సుకు ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ         సర్వీసులు, తయారీ, వ్యవసాయం, నిర్మాణం ఏ రంగాన్ని తీసుకున్నా భారత్‌కు ఒక సమస్యగానే ఉన్నదని తెలిపారు.

ఇది అందరికీ తెలిసిందే. నేను వివరంగా చెప్పాల్సిన పనిలేదు. నిరుద్యోగులు చాలా ఎక్కువ. విసిగివేసారిపోయిన నిరుద్యోగులు మరీ ఎక్కువ. కార్మికుల భాగస్వామ్యం చాలా తక్కువ. మహిళా కార్మికుల భాగస్వామ్యం ఆందోళనకరమైనంత కనిష్ఠంగా ఉంది. ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతున్నప్పటికీ, బాగా చదువుకున్న నిరుద్యోగులు అధికంగా ఉన్నారు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. పీహెచ్‌డీలు కూడా రైల్వేల్లో ప్యూన్లగా పనిచేయడానికి దరఖాస్తు చేసుకుంటున్నారు’ అని చెప్పారు.

సింగపూర్ లేదా సిలికాన్ వ్యాలీకి...

 చాలామంది భారతీయ ఆవిష్కర్తలు ఇప్పుడు సింగపూర్‌కో లేదా సిలికాన్ వ్యాలీకో వెళుతున్నారనే అంశంపై అడిగిన ఒక ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ ‘ప్రపంచంలో ఎవరికీ నేను తక్కువ కాదనే విరాట్ కోహ్లి మనస్తత్వం గల యువ భారత్ ఉంద ని నేను భావిస్తున్నా’ అని చెప్పారు. భారత్‌లో మానవ మూలధనాన్ని మెరుగుపర్చడంతోపై, వారి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టిపెట్టా ల్సిన అవసరం ఉందని ఈ ఆర్థిక వేత్త అభిప్రాయపడ్డారు. వ్యాపారాన్ని భారత్‌లో నెలకొల్పేబదులు, వారు బయటకు వెళ్లడానికి గల కారణాల్ని అన్వేషించాల్సి ఉందన్నారు. ‘అయితే ఆనందించదగ్గ విషయమేమిటంటే పలువురు ఔత్సాహిక వాణిజ్యవేత్తలు ప్రపంచాన్ని మార్చేయాలన్న వారి కోరికను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది భారత్‌లో సంతోషంగా ఉండలేకపోతున్నారు’ అని చెప్పారు.