28 May, 2026 | 3:25 AM

అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు

28-05-2026 02:11 AM
  1. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతాం
  2. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు

మేడ్చల్, మే 27 (విజయ క్రాంతి): అర్హత గల నిరుపేదలందరికి దశల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని  కైతలాపూర్‌లో నిర్మించిన డబు ల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయింపు కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఫతేనగర్ పరిధిలోని అమృత్‌నగర్ తండా నిర్వాసితులకు, 62 మంది గిరిజన నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అందించే 3500 ఇందిరమ్మ ఇళ్లలో భాగం గా స్థలం ఇళ్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు ఎలాంటి వివక్షత లేకుండా దశల వారీగా ఐదు లక్షలరూపాయలు నగదును అందిస్తామన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ది పరిచేందుకు మౌలిక సదుపాయాలైన రోడ్డు, డ్రైనేజి, మంచి నీటి వ్యవస్థలను ఆధునీకరిస్తామన్నారు. ఇందులో భాగంగా ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణకు 15.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. యువ తకు ఉపాధి, ఉద్యోగం కల్పించడానికి ప్రభుత్వం అనేక వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అందించి వారీ కాళ్లపై వాళ్లు నిలబడేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు.

కూకట్‌పల్లి నియోజక వర్గం అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ కలిసి ముందుకురావాలన్నారు. మూసీ ప్రక్షాళన, చెరువుల అక్రమాల నివారణ, పునరుద్ధరణ వంటి చర్యలను చేపట్టి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.