calender_icon.png 23 November, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశ్రామిక భూముల దోపిడీ పాలసీ

23-11-2025 12:48:48 AM

కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్

  1. ఈ పాలసీపై కేంద్రం మౌనమేల? 
  2. కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకుంటే వెంటనే విచారణ జరపాలి 
  3.   5 లక్షల కోట్ల విలువైన భూమిని రూ.5 వేల కోట్లకా?: మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తు న్నది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ కాదని, ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్.. మరో స్కాం చేసేందుకే కొత్త పాలసీ తీసుకొస్తుందని స్పష్టం చేశా రు. పారిశ్రామిక వాడల్లోని దాదాపు పది వేల ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునే కుట్రకు రేవంత్‌రెడ్డి సర్కార్ తెరలేపినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకుంటే వెంటనే విచారణ జరపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. అధికారం లోకి వచ్చిన నాటి నుంచి కూడా అడ్డగోలు దోపిడీ మీదనే రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారని, ప్రజలకు ఏం చేయాలనే ధోరణి కంటే, ఎక ్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే ఆయన ఆలోచనా విధానమని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ హయాంలో అనుమతుల వార్తలు, పె ట్టుబడుల వార్తలు వచ్చేవని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అమ్మకాల వార్తలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని పెంచితే కాం గ్రెస్ అమ్మకాలను పెంచుతుందని విమర్శించారు. గజాల లెక్కన మొదలు కొని, వేల ఎకరాల దాకా ప్రతి ఇంచు భూమిని కూడా వదలకుండా అమ్మేస్తున్నారని ఆరోపించా రు.

భూములు అమ్ముకుంటూ పోతే ఆసుపత్రులు, విద్యాలయాలు చివరకు స్మశానాలు ఏర్పాటు చేయడానికి కూడా భూములు మి గలవని గతంలో ఇదే రేవంత్‌రెడ్డి అన్నారని, అప్పుడు సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములు మిగల్చరా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. 

బడ్జెట్‌తో పోల్చితే రెండు రెట్ల స్కాం

నగరం విస్తరణ జరిగితే ఇతర రాష్ట్రాల్లో పారిశ్రామిక భూములను 50శాతం భూ మిని ప్రభుత్వం తీసుకొని, మిగతా 50శాతం భూములను ఫీజులు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నారని గుర్తుచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం కేవలం 30శాతం తీసుకొని తెగనమ్ముతున్నారని, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదని, అమ్మకాల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక భూముల విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు వాస్తవాలను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలన్నారు.

9,292 ఎకరాల భూమిని 30 శాతం రిజిస్ట్రేషన్ ద్వారా కట్టబెడితే రూ.5 వేల కోట్లు వస్తుందని వెల్లడించినట్టు తెలిపారు. 9,292 ఎకరాల భూముల విలువ రూ. 5 లక్షల కోట్లు అని, అలాంటి విలువైన భూమిని రూ.5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. మిగతా రూ. 4.95 లక్షల కోట్లు స్కాం కదా, దీని వెనుక ఉన్న మత్లబ్ ఏమిటని నిలదీశారు. 9,292 ఎకరాల్లో మొత్తం భూమి కాదని, ఇందులో రోడ్లు, డ్రెయినేజీ పోగా 4,740 ఎకరాలే ఉంటదని మంత్రి శ్రీధర్‌బాబు బుకాయించారని స్ప ష్టం చేశారు.

నిజంగా 4,740 ఎకరాలే ప్రభు త్వం పెట్టిందా, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి శ్రీధర్ బాబుకు సవాల్ విసిరారు. శ్రీధర్‌బాబు భూమిని సగానికి సగం తగ్గించి భూ కుంభకోణం పరిధి తగ్గిం చే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు. దీం తో ప్రభుత్వం డొల్లతనం స్పష్టంగా బయటపడిందన్నారు. మన రాష్ర్ట ప్రభుత్వ బడ్జెట్ తో పోల్చితే రెండు రెట్ల స్కాం అని తెలిపారు. రెండు బడ్జెట్లతో సమానమైన ఇంతటి నిర్ణయాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రాత్రికి రాత్రే చేస్తామంటే ఎందుకు ఊరుకుంటామని హెచ్చరించారు. 

ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం

కోర్టు ఆర్డర్ ఉన్నందున ఆనాడు తాము ఆజామాబాద్ భూముల విషయంలో నిర్ణయం తీసుకుని ఎస్‌ఆర్‌వో కింద 200 శాతం తీసుకున్నామని గుర్తుచేశారు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 30శాతం కడితే చాలు అంటున్నదని విమర్శించారు. రూ. 5 లక్షలు రావాల్సిన చోట రూ. 5 వేల కోట్లు మాత్రమే వస్తాయని మంత్రి కుండబద్దలు కొట్టారని, దీంతో రాష్ర్ట ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టమని వెల్లడించారు. వారం రోజుల్లో అప్లికేషన్లు.. వారంలో టీజీఐఐసీ అప్లికేషన్ల పరిశీలన.. తర్వాత వారం రోజుల్లో అధికారుల కమిటీ అనుమతి.. మొత్తంగా 2 నెలల్లో రూ. 5 లక్షల కోట్లకు రేవంత్‌రెడ్డి సర్కార్ స్కెచ్ వేసిందన్నారు.

మార్కెట్‌లో అమ్మితే రూ. 5లక్షల కోట్లు వస్తయి కదా అంటే సమాధానం లేదని, కోర్టు కేసులు, లీజుల వివాదాలు కార ణం చూపి మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టాలని కుట్ర చేస్తున్నారా అంటే సమాధానం లేదన్నారు. ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించేందుకు తాము టీఎస్ ఐపాస్ పాలసీ తీసుకొస్తే, కాంగ్రెస్ మాత్రం భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓఆర్‌ఆర్ లోపల కాలుష్యం చేసే పరిశ్రమలను వెలుపలకు పంపాలని, కానీ మీ పాలసీ వల్ల గ్రీన్ కంపెనీలు కూడా తరిలిపోతాయన్నారు.

దీంతో ఉపాధి, ఉద్యోగాలు లేకుండా పోతాయని ఆందోళనవ్యక్తం చేశారు. గ్యారెంటీలు వదిలి, దోచుకునే పాలసీలు తెస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో కాలుష్య కారక పరిశ్రమలు 50 శాతం భూముల్లో ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చని, మిగతా 50 శాతం గృహ అవసరాలకు వాడుకోవచ్చు అన్నామని, కానీ కాంగ్రెస్ మాత్రం వాణిజ్య, వ్యాపార, రియల్ ఎస్టేట్ కోసం వినియోగించుకోవచ్చు అంటున్నదని చెప్పారు. 

దేశంలోనే అదిపెద్ద భూ స్కాం

పారిశ్రామిక వేత్తలకు తాము ఇన్సెంటివ్స్ ఇస్తే, మీరు బిల్డర్లు, వ్యాపారులుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. భారత దేశంలో ఇంత పెద్ద భూ స్కాం లేదన్నారు. అసెంబ్లీ పెట్టి వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఇది మీ అయ్య జాగిరి కాదు, నాలుగు కోట్ల ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. తాతల, తండ్రుల, తరతరాల ఆస్తి అని, మీరు ఇష్టం వచ్చినట్లు అమ్ముతం అంటే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

కేటీఆర్ వేసిన ప్రశ్నలకు, తాను అడిగిన ప్రశ్నలకు నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిట్టినా, కేసులు పెట్టినా రేవంత్‌రెడ్డిని వదిలేది లేదన్నారు. ప్రజల హక్కులు, ఆస్తులు కాపాడమే ప్రతిపక్షం బాధ్యత అని, ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, ప్రజా క్షేత్రంలో నీ తప్పులను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. 

ఎనుముల బ్రదర్స్ జేబులు నింపే పాలసీ కాదా?

ప్రభుత్వ దోపిడీని పూర్తి ఆధారాలతో బయటపెడుతున్నామని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం టీజీఐఐసీ రేటు కాదని, ఎస్‌ఆర్‌వో రేటును ఎందుకు పరిగణలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌వో ధరలు తక్కువగా ఉన్నాయని, ముందుగా ఓఆర్‌ఆర్ లోపల, ఆ తర్వాత బయట పెంచుతామని ప్రకటన చేసిన ప్రభుత్వం అది అమలులోకి రాక ముందే ఈ పాలసీని ఎవరి మేలు కోసం తెచ్చారు..

ఎందుకోసం హడావిడిగా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న భూములు కట్టబెట్టడాన్ని ధరలు సవరించే వరకు ఎందు కు ఆగటం లేదని నిలదీశారు. నాడు నో ఎల్‌ఆర్‌ఎస్, నో బీఆర్‌ఎస్ అన్న రేవంత్‌రెడ్డి, ఈ పాలసీ ఎవరికోసమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 30 శాతానికి ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాకుండా అందులోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉన్నాయన్నారు.

కన్వర్షన్ రూపంలో హెచ్‌ఎండీఏకు వచ్చే రూ. 13,500 కోట్ల రూపాయలు రాకుండా రేవంత్ రెడ్డి చేశారని స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్ లోపల మాత్రమే కాదు, ఓఆర్‌ఆర్ చుట్టు పక్కల భూములు కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో ఉందని, ఇది రేవంత్ రెడ్డి, ఎనుముల బ్రదర్స్ జేబులు నింపే పాలసీనా కాదా సమాధానం చెప్పాలన్నారు. ఆరు నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేశారని, విలువైన భూములను, సగానికి సగం ఎనుముల బ్రదర్స్ చేతుల్లోకి పోవడంతోపాటు కమీషన్లు, వాటాలు కూడా మాట్లాడు కున్నారని తెలిపారు.

ఇది ప్రీప్లాన్డ్ స్కాం అని, త్వరలో ఆ భూములు, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేశారో బయటపెడతామని చెప్పారు. ఇది ముమ్మాటికీ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ కాదు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్ఫర్మేషన్ పాలసీ అని ఎద్దేవా చేశారు. వచ్చే 30శాతం డబ్బును కొత్త పరిశ్రమలకు వాడుతారా, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేయడం కోసం వాడుతారా? లేదా బడా బడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని వారి బిల్లులు చెల్లించేందుకు వాడుతారా అని ప్రశ్నించారు.