23-11-2025 12:53:03 AM
ప్రజలకు కనిపించని ప్రభుత్వ ఉత్తర్వులు!
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీలు వివిధ పిటిషన్లను విచారించి తీర్పును రిజర్వ్‌లో ఉంచుతారు. తరువాత తీర్పు చెబుతారు. అన్ని హైకోర్టుల్లోని అందరు జడ్జీలు వివిధ కేసులకు సంబంధించి ఎప్పుడు తీర్పును రిజర్వ్‌లో ఉంచారు?.. ఎప్పుడు తీర్పును వెల్లడించారనేది పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. దీనివల్ల జడ్జీలు తీర్పు వెల్లడించడానికి ఎంత సమయం తీసుకున్నారనేది ప్రజలకు అర్థమవుతుంది.. అంటూ సుప్రీంకోర్టు ఈనెల 12న ఒక పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
తెలంగాణ ప్రభుత్వం..
శుక్రవారం రాష్ట్రంలో వివిధ స్థాయిల్లోని 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు (జీవోఆర్టీ నెం.1632) జారీ చేశారు. అయితే ఈ జీవోను శుక్రవారం రాత్రివరకు కూడా ఆన్‌లైన్‌లో (పబ్లిక్ డొమైన్) ప్రజలకు అందుబాటులో ఉంచలేదు.
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : పారదర్శకత విషయంలో ప్రభుత్వాలు ఎందుకనో మొద టినుంచి నర్మగర్భంగానే వ్యవహరిస్తున్నట్టు కనపడుతోంది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ.. దేశంలోని ప్రభు త్వాలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాయా.. లేదా అనేది వివిధ పిటిషన్ల ద్వారా సమీక్షిం చే సుప్రీంకోర్టు సైతం పారదర్శకతకు పెద్దపీట వేస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పారదర్శకతపై ఒకడుగు వెనక్కు వేస్తున్నట్టుగానే ఉంది.
ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. సాక్షాత్తు సుప్రీంకోర్టే జడ్జీలు ఇచ్చే తీర్పులను ప్రజలకు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవావాదులు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికికూడా వందలాది కీలకమైన, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం లేదంటూ వారు వాపోతున్నారు.
తాజాగా శుక్రవారం (21.11.2025) నాడు సుమారు 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులనుకూడా పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ఇదొక్కటే కాదని.. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల బది లీలకు సంబంధించిన జీవోలు పబ్లిక్ డొమైన్‌లో కనపడటం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటుం డటం గమనార్హం.
ఇప్పటివరకు కేవలం 5,018 జీవోలే..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు (21.11. 2025) రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉత్తర్వులను జారీచేసింది. అయితే ఇందులో కేవలం 5,018 మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉండటం గమనా ర్హం. ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి వెలువడే జీవోలు ప్రతియేటా సుమారు 10 వేల వరకు ఉంటాయని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. కానీ గడిచిన 23 నెలల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్న జీవోలు కేవలం 5,018 మాత్రం ఇక్కడ గమనించాల్సిన అంశం. అంటే వేలాది జీవోలను రహస్యంగా ఉంచారనే అనుకోవాల్సి వస్తోంది.
గత ప్రభుత్వ హయాంలోనే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం ప్రారంభం అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో అంతర్గత జీవో లు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాల్సిన అవసరం లేదంటూ కోర్టు సూచనలతో.. అన్ని శాఖలుకూడా అన్ని జీవోలను అంతర్గత అంశాలు గా పేర్కొంటూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. గత ప్రభుత్వం నుంచి ఈ జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం అనేది కొనసాగు తూనే ఉందని ప్రజావర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తుండటం గమనార్హం.
ఉదాహరణలు..
* మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.. ఆర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) విభాగాన్ని పరిశీలిస్తే.. 2025 జనవరి 1 నుంచి శుక్రవారం (21.11.2025) నాటికి ప్రజలకు అందుబాటులో ఉన్న జీవోలు కేవలం 258 మాత్రమే. అందులోనూ.. పబ్లిక్ డొమైన్‌లో కనపడేవి జీవో నెం. 148 తరువాత జీవో నెం. 241 మాత్రమే. అం టే ఆ రెండింటి మధ్యలో ఉండే జీవోలన్నీ అంతర్గత సమాచారం అనే నెపంతో ప్రజలకు అందుబాటులో ఉంచడం లే దు. వాస్తవానికి ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ అత్యధికంగా రహస్యంగా జీవో లను ఉంచుతున్న శాఖ ఎంఏయూడీ అని అందరూ ఆరోపిస్తున్నదే.
* ఇక నీటిపారుదల శాఖ నుంచి బయట పెట్టిన జీవోలు ఈ సంవత్సరం కాలంలో కేవలం 41 మాత్రమే. అవికూడా.. జీవో ఆర్టీ నెం. 4, 12, 24, 25,... 90, 129, 131, 151, 177... ఇలా నెంబర్లలో జం బ్లింగ్ కనపడుతూ ఉంటుంది. మధ్యలో జీవోలు ఏమయ్యాయంటే.. అంతర్గత సమాచారం అంటూ.. దాటవేయడం ఎ ప్పుడూ చేసేదే.
* ఇదే కాదు.. అన్ని శాఖల్లోనూ ఇదే తం తు.. వరుస నెంబర్లతో జీవోలు సిద్ధమై.. వాటిని పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినా.. ప్రజ లు చూస్తే అందులో చాలా నెంబర్ల జీవో లు వారికి కనిపించవు. వీటిని ఆయా శా ఖలు రహస్యంగా ఉంచుతాయన్నమాట.
సుప్రీంలో అలా.. రాష్ట్రంలో ఇలా..
ఒకవంక సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే పారదర్శకతకు పెద్దపీఠ వేస్తూ.. ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకడుగు వెనుకకు వేస్తుందని సామాజికవేత్తల విమర్శలు సహేతుకమనే అనుకోవాల్సి వస్తోంది. ఎంతో కీలకమైన, ముఖ్యమైన సమాచారం ఉండే సుప్రీంకోర్టు తీర్పులే పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతుంటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడే జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచకుండా రహస్యంగా దాచడం వెనుక మతలబు ఏమిటనే పశ్నకు సమాధానం రావడం లేదు. అదీగాక.. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. ప్రజలకు అన్ని జీవోలను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే నిజమైన ప్రజాపాలన అనిపించుకుంటుందని అటు రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు హితవు చెబుతున్నారు..!
సుప్రీంకోర్టు పారదర్శకత నిర్ణయం..
ఈనెల 12న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భం గా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్‌మాల్య బగ్చి బెంచి పారదర్శకత విషయంలో, హైకోర్టు జడ్జీల తీర్పులను వెల్లడించే విషయంపై సూటిగా వ్యాఖ్యానించింది. జార్ఖండ్ హైకోర్టు తమ క్రిమినల్ అప్పీలు విషయంలో తీర్పు చెప్పడం లేదని జీవితఖైదీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అప్పటికే తమ పిటిషన్‌పై తీర్పు ను రిజర్వ్‌చేసి సుమారు రెండు, మూడు సంవత్సరాలు అవుతున్నదని పిటిషన్‌దారులు వేడుకున్నారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచి పై విధంగా వ్యాఖ్యానిస్తూ.. అన్ని హైకోర్టుల్లోని జడ్జీలు తాము విచారించే పిటిషన్ల విషయంలో తీర్పును రిజర్వ్‌చేసిన తేదీని, అలాగే తీర్పును వెలువరించే తేదీని ప్రజలకు (పబ్లిక్ డొమైన్‌లో) అందుబాటులో ఉంచాలని స్పస్టంగా పేర్కొన్నారు.
నిజానికి హైకోర్టు జడ్జీలు తీర్పును వెలువరించే విషయంలో ఎంత సమయం తీసుకోవాలనేది స్పష్టమైన నిబంధనలు లేవు. అ యితే సాధారణంగా తీర్పు రిజర్వ్ చేసినప్పటి నుంచి హేతుబద్ధమైన సమయంలో తీర్పు చెప్పాలని అంటున్నారు. ఇది సాధా రణంగా రెండు నుంచి ఆరు నెలల పాటు సమయం తీసుకుంటారని వివిధ న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మాత్రం కొన్నిసార్లు.. సంవత్సర కాలంపైగా సమయం తీసుకుంటున్నారు. అదికూడా కేసులో చట్టానికి సంబంధించిన సంక్లిష్టత ఉన్నప్పుడే ఇలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఈనెల 12న సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ సందర్బంగా అప్పటికే తదుపరి చీఫ్ జస్టిస్‌గా ప్రకటించిన జస్టిస్ కాంత్ వ్యాఖ్యానిస్తూ.. జడ్జిమెంట్‌ల విషయంలో పారదర్శకత ఉండాలి. ప్రజలం దరూ తెలుసుకునేలా పబ్లిక్ డొమైన్‌లో ఈ సమాచారం ఉంచాలి. ఎప్పుడు తీర్పును రిజర్వ్ చేశారు.. ఎప్పుడు తీర్పును వెలువరించారు.. ఎప్పుడు ఆ తీర్పును పబ్లిక్ డొమైన్‌లో ఉంచారనేది స్పష్టం గా ఉండాలంటూ వ్యాఖ్యానించారు.
మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి .. హైకోర్టు వెబ్‌సైట్‌లలో దీని కోసం ప్రత్యేకంగా ఒక డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని, అందులో తీర్పును రిజర్వ్‌చేసిన తేదీ, తీర్పు వెలువడిన తేదీ, అప్‌లోడ్ చేసిన తేదీలను పొందుపర్చాలని.. అప్పుడే దేశ ప్రజలకు న్యాయశాఖ జవాబుదారీ, పారదర్శకత అర్థమవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.