ఉన్నతాధికారుల పోస్టింగ్‌లలో బీసీ ఉద్యోగులకు అన్యాయం
ముఖ్యమైన పోకల్ పోస్టులు బీసీలకు ఇవ్వాలని సీఎంకు లేఖ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్1, గ్రూప్ 2, ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్ లాంటి తదితర ఉన్నత స్థాయి అధికారుల పోస్టింగ్ లలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని, దీనిని సరిదిద్దడానికి బీసీలకు ప్రాముఖ్యత కలిగిన పోస్టులను బీసీలకు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ లాంటి అర్బన్ ప్రాముణ్యత కలిగిన ఉన్నత ఉద్యోగాలలో ముఖ్యంగా రెవిన్యూ శాఖా, పోలీస్ శాఖ ఉన్నత ఉద్యోగులలో పోకల్ పోస్టులు బీసీలకు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
ఇరిగేషన్ శాఖలో ఇంజినీరింగ్ పోస్టులలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆర్డిఓ లాంటి ప్రాదాన్యత గల పోస్టులు బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుందన్నారు. కొత్త పోస్టులకు రిక్రూట్ మెంట్ విధానంలో కొత్త పోస్టర్ విధానం కూడా బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందన్నారు. దీని మూలంగా రిక్రూట్ మెంట్ లో గ్రూప్1-2 స్థాయి పోస్టులతో బీసీలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. బీసీ ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.






