నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ అరిఘాత్
జాతికి అంకితం చేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్
విశాఖపట్నం, ఆగస్టు 29: భారత నౌకాదళంలో రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను విశాఖపట్నం వేదికగా గురువారం జలప్రవేశం చేశారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ తరగతికి చెందిన ఈ న్యూక్లియన్ సబ్‌మెరైన్‌ను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత నేవీ మరో మైలురాయిని చేరుకుందని ప్రశంసించారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలనే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సంకల్పానికి ఇదే తిరుగులేని నిదర్శమని పేర్కొన్నారు. నేడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు ముందుకు దూసుకుపోతోంది.
రక్షణతో పాటు ప్రతి రంగంలో ముఖ్యంగా నేటి భౌగోళిక, రాజకీయ అంశాల్లో వేగంగా అభివృద్ధి చెందడం మనకు ఎంతో అవసరం. ఆర్థిక వృద్ధితో పాటు బలమైన సైన్యం అవసరం. భారత్‌లో తయారు చేసిన అత్యున్నత నాణ్యతతో కూడిన ఆయుధాలు, ప్లాట్‌ఫామ్స్‌ను మన సైనికులకు అందించేందుకు మా ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది అని తెలిపారు. ఈ జలాంతర్గామితో హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యత, శాంతిని నెలకొల్పడటంలో సహాయపడుతుందని రక్షణ శాఖ పేర్కొంది. దేశ భద్రతలో నిర్ణయాత్మక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. అరిఘాత్ నిర్మాణంలో దేశీయంగా రూపొందించిన అధునాతన డిజై న్, సాంకేతికత, ప్రత్యేక మెటీరియల్ వినియోగించినట్లు తెలిపింది.




