5 July, 2026 | 12:02 PM

సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

05-07-2026 11:22 AM

అధికారులు బాధ్యత, పారదర్శకతతో పని చేయాలి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై శ్వేతపత్రం సిద్ధం చేయాలి

పెద్దపల్లి జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధుల సుదీర్ఘ సమీక్ష లో మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి,జూలై 04(విజయ క్రాంతి): జిల్లాలో సాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు మరింత బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. శనివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో కలిసి జిల్లా స్థాయి శాఖల ప్రగతిపై విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పౌరసరఫరాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య, విద్యా శాఖలతో పాటు పలు సంక్షేమ శాఖల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సాగాలి

ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాలకు పైగా పదవీకాలం ఉందని, ఈ సమయంలో ప్రజల సమస్యలను ఓపికగా వింటూ, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రజాప్రతినిధులు-అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయిలో సమగ్ర శ్వేతపత్రం సిద్ధం చేయాలని ఆదేశించారు.

యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే ఆదర్శం

రైతుల కోసం పెద్దపల్లి జిల్లాలో ప్రవేశపెట్టిన 'యూరియా బుకింగ్ యాప్' అద్భుత ఫలితాలు ఇస్తూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆయిల్ పామ్, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని, ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల వరి వంగడాల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, పరిశ్రమల పార్కులకు సంబంధించిన భూసేకరణను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు: ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు

ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు మాట్లాడుతూ.. గతంలో ధాన్యం విక్రయిస్తే నెలన్నర వరకు డబ్బులు రాని పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుత కలెక్టర్ పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమవుతోందని తెలిపారు. సన్న రకాలకు ప్రభుత్వం ఇస్తున్న బోనస్ వల్ల రైతులకు గత రైతుబంధు కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతోందని, రైతులు ప్రభుత్వం సూచించిన వంగడాలనే సాగు చేయాలని కోరారు.

వివిధ రంగాల్లో ముందంజలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, యాసంగిలో యూరియా యాప్ వల్ల వినియోగం 19 శాతం తగ్గిందని, ప్రస్తుతం వానాకాలానికి నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గత సీజన్‌లో 65,129 మంది రైతుల నుండి రూ.1,057 కోట్ల విలువైన 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత కింద రూ.130.24 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, రెండో విడత సర్వే సాగుతోందని వివరించారు. ఎలిగేడు వద్ద అంతర్జాతీయ స్థాయి గోదాములు, పీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్లు, మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు విధానం, బాల్యవివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి సాధించిన విజయాలను కలెక్టర్ వివరించారు.

పుస్తకావిష్కరణ - అంబులెన్స్ ప్రారంభం

సమీక్షకు ముందు మంత్రులు, ప్రజాప్రతినిధులు కలెక్టరేట్‌లో అమరవీరుడు దొడ్డి కొమురయ్య, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక" పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే కలెక్టరేట్ ఆవరణలో అత్యవసర వైద్య సేవల కోసం కేటాయించిన నూతన అంబులెన్స్‌ను మంత్రి శ్రీధర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ, డీఆర్ఓ రాజేశ్వరి, ఆర్డీఓలు సురేష్, గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ. అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్. మల్లయ్య మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా ప్రగతిపై మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల సుదీర్ఘ సమీక్ష

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేసి సంక్షేమ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో విజయవంతమైన యూరియా బుకింగ్ యాప్, 48 గంటల్లో ధాన్యం చెల్లింపులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రగతి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించి, నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు.