కాళేశ్వరం దేవస్థానంలో పురాతన విగ్రహాల పరిశీలన
మ్యూజియం ఏర్పాటుకు వేగం
కాళేశ్వరం మార్చి 18(విజయక్రాంతి )శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం,గ్రామ పరిధిలో ఉన్న పురాతన విగ్రహాలను ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్తో పాటు పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి, డిప్యూటీ సూపరింటెండెంట్ కోటయ్య పరిశీలించారు.గ్రామంలో విస్తరించి ఉన్న అనేక పురాతన విగ్రహాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం, వాటన్నింటినీ ఒకే ప్రదేశంలోకి తరలించి శుభ్రపరిచి,
దేవాలయ ఆవరణలో సక్రమంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్యల ద్వారా పురాతన శిల్ప సంపదను సంరక్షించడంతో పాటు భక్తులకు, సందర్శకులకు అవి సులభంగా దర్శనమివ్వేలా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం పర్యటనలో భాగంగా దేవాలయ ఆవరణలో మ్యూజియం ఏర్పాటు చేయడానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో పురాతన విగ్రహాల సమీకరణ, సంరక్షణ పనులు మ్యూజియం ఏర్పాటుకు దోహదం చేయనున్నాయి.మ్యూజియం ద్వారా ప్రాంతంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.




