03-02-2026 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం /లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయం సాధించేందుకు సమీకృత వ్యవసాయ విధానం ఉత్తమ మార్గమని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామంలో రైతు పడిగా ప్రశాంత్ ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో అమలు చేస్తున్న సమీకృత, ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. ఈ సమీకృత వ్యవసాయ కేంద్రంలో ఆకుకూరలు, మునగతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సాగు చేస్తున్న తీరును కలెక్టర్ ప్రశంసించారు. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు రైతు పడిగా ప్రశాంత్ను అభినందించారు.
యూనిట్లో కొనసాగుతున్న కొర్రమీను చేపల పెంపకం, మేకల పెంపకం, బ్యాక్యార్డ్ మదర్ యూనిట్, డక్స్ యూనిట్లను కూడా పరిశీలించి, వాటి నిర్వహణపై రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ తరహా సమీకృత వ్యవసాయ యూనిట్లు జిల్లాలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అనంతరం మైలవరం గ్రామంలో రైతు మాడె కృష్ణవేణి ఏర్పాటు చేసిన కౌజు పిట్టల యూనిట్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ యూనిట్ను కేవలం రూ.25,000/- తక్కువ పెట్టుబడితో షెడ్ నిర్మాణం, ఫెన్సింగ్, కౌజు పిల్లలు, ఫీడ్ మరియు అవసరమైన పరికరాలతో ఏర్పాటు చేసిన విధానాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తక్కువ పెట్టుబడితో గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ యూనిట్లను జిల్లాలో విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని , జిల్లాలో ఈ విధంగా 500 కౌజు పిట్టల యూనిట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే మైలవరo గ్రామానికి చెందిన యువ రైతు కుంజా సందీప్ అమలు చేస్తున్న ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. అనేక రకాల సమీకృత పంటల సాగుతో పాటు జీవామృతం, పంచగవ్య వంటి సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లను పరిశీలించి, సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరిగి, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా యువ రైతు కుంజా సందీప్ను కలెక్టర్ అభినందిస్తూ, సేంద్రియ సాగును మరింత విస్తృతంగా చేపట్టాలని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ గ్రామంలోని యువ రైతులకు సమీకృత వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సుజాతనగర్లోని రవి హైబ్రిడ్ సీడ్స్ కేంద్రాన్ని సందర్శించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకయ్య,సంబంధిత శాఖల అధికారులు, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.