19 July, 2026 | 8:50 PM

ద్విచక్ర వాహనాల అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..!

19-07-2026 01:10 PM

హ్యాండిల్ లాక్ లేని పార్కింగ్ చేసిన వాహనాలపైనే దృష్టి.

చోరీ అనంతరం తక్కువ ధరకు ఇతరులకు అమ్మకాలు.

52 బైకులు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్, మరో నిందితుడు జైలులో

నాగర్‌ కర్నూల్, జూలై 18 (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్, బిజినేపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారి ఇప్పటికే మరో కేసులో అరెస్టై మహబూబ్‌నగర్ జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మొత్తం 52 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి తండా, ఉడుగుల కుంట తండా ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు సంతోష్ నాయక్, మంగనూరు గ్రామానికి చెందిన పిట్టల చరణ్ కుమార్, అదే గ్రామానికి చెందిన జంగం యాదయ్య, చింతకాయల కృష్ణంరాజులు పాతికేళ్ల వయసుగల యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీ కోసం రాష్ట్రంలోని ఆయా జిల్లాల పరిధిలో హ్యాండిల్ లాక్ వేయకుండా ఇళ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్ చేసిన బైకులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారని విచారణలో బయట పడిందన్నారు. ముఠాగా ఏర్పడిన ఈ నిందితులు వాటిని తక్కువ ధరలకు ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవారు.

మహబూబ్‌నగర్-20, సైబరాబాద్-14, హైదరాబాద్-4, వనపర్తి-3, షాద్ నగర్ ఫ్యూచర్ సిటీ-1, యాదాద్రి జిల్లాలతో 3 బైకులతో పాటు నాగర్‌కర్నూల్, బిజినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధుల్లో మూడు చోరీకి గురైన బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోచుకున్న వాహనాలను బిజినపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులకు సామాన్యులకు తక్కువ ధరకు విక్రయించారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన 26 మంది పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సూచించారు. సమావేశంలో డిఎస్పి బుర్రి శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి, ఎస్సై గోవర్ధన్, సంషుద్దీన్, పోలీస్ కానిస్టేబుల్ భీముడు, వెంకటేష్, ప్రవీణ్, హోంగార్డు రమేష్  కేసును ఛేదించిన వారిలో ఉన్నారు. వారి బృందాన్ని ఎస్పీ అభినందించారు