మానవత పోలిమేరల్లోకి
08-06-2026 12:00 AM
నా వాళ్లంతా నాగళ్లకు శిలువ వేయబడి
తరతరాలుగా నెత్తురుని
అంతకంటే అమూల్యమైన చెమటని
సమాజం కోసం ధార పోస్తున్నప్పుడు
నేనొక్కడిని స్వార్థంతో
కాలేజీ క్యాంపస్ పోలిమేరల్లో
సాహితీ సభల్లో
శాసన సభల్లో
కోర్ట్ దర్బారుల్లో
ప్రజా వేదికల్లో
చెదలుపట్టిన చేతులతో
పుచ్చు విత్తనాల్లాంటి వాగ్దానాలతో
శవం లాంటి మనిషిలా బతకలేను
అందుకే వెళ్తున్నాను
మానవత పోలిమేరల్లోకి !
నన్నక్కడే నా వాళ్లతో
నాగళ్లకు శిలువ వేసినా సరే
కంకర కొడుతున్న వాళ్లతో
కాంక్రీట్ చేసినా సరే
అక్కడే.. నేను కోయిలనై
కొత్తగానం చేస్తాను !!
మల్లారెడ్డి






