8 June, 2026 | 1:44 AM

తరాజు లేని తూకం

08-06-2026 12:00 AM

పానం సోంప్తలేదు

ఒళ్ళంత బరువు బరువు

పియ్యంత కుంఫు కుంఫు

యాష్ట అలిష్ట అనకుండ

అంగవడి పనిచేత్తెనే మంచిగ

పని లేకపోతే పాడే

పొద్దటిది పొట్టకు

మాపటిది బట్టకు

అన్నోళ్లకు యాడ పొద్దూక్తది

యాడ తెల్లార్తది

బతుకంతా బండ మోతే

శ్రమకు దక్కేది బుక్కెడు బువ్వే

అండ్లవోంగ

ఎండకు అగ్గి భగ్గుమని అగిర్తేసుడు

వానకు గుబులు గుబులు

చలికి సవ సవ

పానం సొడ సొడలు పోవుడు

జీవం తడతడమనుడు

జీవనం భూచక్రమే

శారీరకమైనా 

మానసికమైనా

శ్రమకు ప్రతిఫలం

వేతనం మాత్రమే

శ్రమే శ్రామిక నాగరికత

శ్రమే ఆహార తయారీ రసాయన ప్రక్రియ

శ్రమయే సకలార్థకరం

చెమట చుక్కల బరువును

తెల్లబడ్డ బొక్కల రంగును

నరాల తీగల మీద నడిచే శ్రమను

నిద్ర మింగిన కళ్ల చీకటిని

ఎత్తుగట్టిన తరాజు లేదు

తూకం వేసే యంత్రం లేదు !!

బాలకృష్ణ