21 August, 2026 | 10:44 PM

పిల్లల ప్రవర్తనను.. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి

21-08-2026 10:12 PM

ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురండి

టిపి టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కర్నే సురేందర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిపిటిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కర్నే సురేందర్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పలు పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద రూపా రెడ్డి చిత్రపటం ముందు కొవ్వొత్తులను వెలిగించి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా  సురేందర్ మాట్లాడుతూ ప్రతి టీచర్ కూడా తమ విద్యార్థులను ప్రయోజకునిగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తారన్నారు. ఈ క్రమంలో పిల్లలు చేసే తప్పులను గుర్తించి మందలించే క్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను తిట్టడం దాడులు చేయడం వల్ల భయం లేక పిల్లలు మరింతగా చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. పాఠశాల నుండి ఇంటికి వెళ్లిన పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని ముఖ్యంగా మొబైల్ వాడకం అపరిచితులతో ఫోన్లో సంభాషించడంపై దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. హత్యకు గురైన రూపాయిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.