మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తి రిమాండ్
మునిపల్లి,(విజయక్రాంతి): మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి జరిమానా విధించి 5రోజుల పాటు రిమాండ్ కు తరలించినట్లు మునిపల్లి ఎస్ఐ అరవింద్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బుదేరా చౌరస్తాలో శుక్రవారం వాహనాల తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన రాజు రఫిక్ థంబోలి మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడ్డాడు.
అధిక మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో నిందితుడైన రాజు రఫిక్ థంబోలిని సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా కేసు విచారించన న్యాయమూర్తి వి.లక్ష్మీకళ రూ.2,000 జరిమానా విధించడంతో పాటు 5 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. అందుకు వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు సూచించారు.






