16 July, 2026 | 6:29 PM

పసిడిపై పెట్టుబడి చేస్తున్నారా!

18-04-2024 01:53 AM

భౌతిక బంగారమే కాదు... మదుపునకు పలు మార్గాలు.. పసిడి లాభాలపై పన్నులూ చెల్లించాలి

గత కొద్ది వారాలుగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జోరుగా పెరుగుతున్న ఆస్తి ఎదైనా ఉందంటే..అది బంగారమే. షేర్లు, బాండ్లు, క్రిప్టోకరెన్సీ, క్రూడ్ తదితర లిక్విడ్ ఆస్తులన్నింటినీ తలదన్ని పుత్తడి భారీ ర్యాలీ జరిపింది. కేవలం రెండు వారాల్లో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,150 డాలర్ల నుంచి 2,460 డాలర్ల స్థాయికి, దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల ధర రూ. 62,000 నుంచి రూ.73,300 వద్దకు ఎగిసిపోయింది. ఇంత వేగంగా పెరుగుతున్న ధరను చూసిన మదుపుదారుల్లో పసిడిలో పెట్టుబడి చేయాలన్న ఆసక్తి కలగడం సహజం. అయితే బంగారంలో మీ పొదుపు సొమ్మును మదుపు చేసే ముందు.. అందులో పెట్టుబడి చేసేందుకు ఉన్న మార్గాలు, భవిష్యత్‌లో పొందే లాభాలపై పడే పన్ను భారం తెలుసుకోవడం శ్రేయస్కరం. అవి ఏమిటో చూద్దామా..

భౌతిక బంగారం (గోల్డ్ కాయిన్/బిస్కెట్స్)

ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ అవుట్‌లెట్స్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ వీటిని కొనవచ్చు. అలాగే ఎంపికచేసిన జ్యువెలర్స్ అవుట్‌లెట్స్, ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఇవి లభిస్తాయి.  పెట్టుబడి కోసం బంగారం ఆభరణాలకంటే ఈ గోల్డ్ కాయిన్స్/బిస్కెట్లు మెరుగు. ఎందుకంటే వీటికి అదనంగా మేకింగ్ ఛార్జీలు ఉండవు. అయితే సురక్షితంగా దాచుకునేందుకు లాకర్ ఛార్జీలు అయితే తప్పవు. ఈ భౌతిక బంగారాన్ని తిరిగి విక్రయించిన తర్వాత వచ్చిన రాబడిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది. కొన్న తర్వాత మూడేండ్లలోపు విక్రయిస్తే మీ ఆదాయపు పన్ను శ్లాబ్‌ను అనుసరించి పన్ను చెల్లించాలి. మూడేండ్ల తర్వాత ఒనగూడే లాభాలపై 20 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్లస్ సెస్ చెల్లించాలి.

ఆభరణాలు

బంగారాన్ని కొనే ఆలోచనరాగానే జ్యువెలరీ దుకాణానికి పరుగులు తీస్తాం. పెండిండ్లు, ఇతర గృహ అవసరాలకు తప్ప కేవలం పెట్టుబడి చేయడానికైతే ఆభరణాల కొనుగోలు భౌతిక బంగారం, డిజిటల్ పుత్తడికంటే ఖరీదైన వ్యవహారం. ఎందుకంటే వీటిపై 10 శాతం మేకింగ్ ఛార్జీలు పడతాయి. లాకర్ ఛార్జీలు అదనం. వీటిని తిరిగి విక్రయించిన తర్వాత వచ్చే లాభాలపై పన్నులు గోల్డ్ కాయిన్స్/బిస్కెట్ల తరహాలోనే ఉంటాయి.

సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు)

భౌతిక బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపర్చడానికి, బంగారం మదుపులో వచ్చే లాభాలకు తోడు కొంత వడ్డీని సైతం అదనంగా ఇచ్చే సాధనం సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్‌జీబీలు) 2016లో ప్రవేశపెట్టారు. ఈ బాండ్లను విడతలవారీగా ఆర్బీఐ విడుదల చేస్తుంది. 8 ఏండ్ల కాలపరిమితితో జారీఅయ్యే ఈ బాండ్లను ఐదేండ్ల తర్వాత ముందస్తుగా కూడా సమర్పించి నగదును పొందవచ్చు. కొనుగోలు చేసేటపుడు మార్కెట్ ధర ఆధారంగా జారీ అయ్యే ఈ బాండ్లను తిరిగి సబ్‌మిట్ చేసే సమయంలో మార్కెట్ ధరనే పొందవచ్చు. వీటిపై 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ సైతం లభిస్తుంది. కాలపరిమితి ముగిసేంతవరకూ వీటిని అట్టిపెట్టుకుంటే ఈ బాండ్లపై వచ్చే లాభంపై పన్ను ఉండదు. కానీ వీటిని కొన్న తర్వాత మూడేండ్లలోపు సెకండరీ మార్కెట్లో విక్రయిస్తే వచ్చే రాబడిపై మీ ఐటీ ట్యాక్స్ శ్లాబ్ ఆధారంగా పన్ను చెల్లించాలి. కొనుగోలు చేసిన మూడేండ్ల తర్వాత సెకండరీ మార్కెట్లో విక్రయిస్తే ఇండెక్సేషన్ అనంతరం 20 శాతం లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి.

గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)

వివిధ మ్యూచువల్ ఫండ్స్ ఈ గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ను (ఈటీఎఫ్‌లు) నిర్వహిస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గణాంకాల ప్రకారం 2024 ఫిబ్రవరి చివరినాటికి దేశంలో రూ.28,529 కోట్ల విలువైన 17 గోల్డ్ ఈటీఎఫ్‌లు నిర్వహణలో ఉన్నాయి. ఆయా ఫండ్స్ తాజాగా జారీచేసే గోల్డ్ ఈటీఎఫ్‌లను, మార్కెట్లో ట్రేడయ్యే ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి చేయవచ్చు. విక్రయించవచ్చు. ఒక్కో యూనిట్ ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానమైన ధరలో ఉంటుంది. స్వల్పంగా నిర్వహణా ఛార్జీలు ఉంటాయి. 

టార్గెట్ రూ.౮౩ వేలు గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా

బంగారం పరుగు ఇప్పట్లో ఆగబోదని, ప్రస్తుత సంవత్సరాంతానికి ఔన్సు బంగారం ధర 2,700 డాలర్లను చేరుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా వేసింది. అంటే ప్రస్తుత 2,375 డాలర్ల నుంచి మరో 325 డాలర్లు పెరుగుతుందని (13.7 శాతం) అంచనా. గోల్డ్‌మాన్ శాక్స్ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే 2024 చివరినాటికి రూపాయిల్లో ఇక్కడ 10 గ్రాముల ధర మరో రూ.9,000 పెరిగి రూ.83,000కు చేరే అవకాశం ఉంటుంది. గతవారం అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధర 2,448 డాలర్ల రికార్డుస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా బంగారం ధర 20 శాతం మేర ఎగిసింది.  సాధారణంగా బంగారం ధరను వాస్తవ వడ్డీ రేట్లు, ఆర్థికాభివృద్ధి అంచనాలు, డాలరు విలువ ప్రభావితం చేస్తుంటాయని, ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం పెరగడానికి ఈ సాంప్రదాయ అంశాలు కారణమని చెప్పలేమని గోల్డ్‌మాన్ శాక్స్ తెలిపింది. కేంద్ర బ్యాంక్‌ల కొనుగోళ్లు, రిటైలర్ల ఆసక్తితో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయన్నది.

మదుపు సాధనాలు

సాధనం అదనపు వ్యయం/ఆదాయం పన్ను రేటు

బంగారం కాయిన్లు లాకర్ ఛార్జీలు మూడేండ్ల తర్వాత విక్రయిస్తే

20 క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్

బంగారం ఆభరణాలు మేకింగ్+లాకర్ ఛార్జీలు మూడేండ్ల తర్వాత విక్రయిస్తే

20 క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్

ఎస్‌జీబీలు 2.5 శాతం వడ్డీ ఆదాయం మెచ్యూరిటీ తర్వాత పన్ను లేదు

గోల్డ్ ఈటీఎఫ్‌లు ఛార్జీలు/ఆదాయం లేదు ఐటీ శ్లాబ్‌కు అనుగుణంగా పన్ను