16 July, 2026 | 6:11 PM

ఏం తినాలి? ఎలా బతకాలి?

19-04-2024 12:00 AM

కావాలని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలని ఎవరమూ అనుకోం. కానీ, అసలు వాస్తవాలు వేరే వున్నాయి. చాలావరకు మార్కెట్లలో లభ్యమయ్యే కూరగాయలు, పండ్లు చూడటానికి ఎంతో తాజాగానే కనిపిస్తాయి. దేశీయ ఉత్పత్తులకు తోడు సంకర, విదేశీ జాతులు. ఆకుకూరలు  సైతం వెంటనే వండుకోవాలన్నంతగా మురిపిస్తాయి. ఒక దశలో అసలు సహజమైన వాటిని సైతం ‘ఇవి’ మించి పోతున్నాయంటే ఆశ్చర్యమే మరి.

వికృత దుష్ఫలితాలతో విజృంభిస్తున్న పెస్టిసైడ్స్ ‘డర్టీ ఫుడ్’ మాయలో జనం అయోమయం బెంబేలెత్తిస్తున్న బెండకాయలు మొదటి స్థానంలో స్ట్రాబెర్రీ, రెండోస్థానంలో పాలకూర పదేండ్లుగా యాపిళ్లలో తీపి శూన్యం

సాగు సమయంలో పురుగుమందుల (పెస్టిసైడ్స్) బారిన పడని  పంట, అలాగే వాటి అవశేషాలుగల పండ్లు, కూరగాయాలను (ఎంతో కొంతమేర, ఏదోలా) తినని మనిషి భూమ్మీద ప్రస్తుతానికి లేనట్టేనని పలు శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. ఇవాళ  పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే, కూరగాయలు, పండ్లనుండి తృణధాన్యాలు, తిండిగింజల వరకు ఏదైనా రసాయన రహితమంటే నిజంగానే నమ్మబుద్ధి కావడం లేదు. అంటే, దాదాపు అందరమూ అంతగా ‘డర్టీ ఫుడ్’ మార్కెట్ మాయాజాలంలో నిండా మునిగిపోయాం. కాకపోతే, ‘ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ’  అంతే. పూర్తి సేంద్రియ విధానంలో పండిన ఆహార ఉత్పత్తులు ఎక్కడైనా, ఎవరికైనా లభ్యమైతే వారికంటే అదృష్టవంతులు మరొకరు వుండరు. కానీ, ఒకవైపు పెరుగుతున్న జనాభా అవసరాలు,  మరోవైపు శ్రుతి మించుతున్న వ్యాపారకాంక్షలు సామాన్యులకు  ఇప్పట్లో ఈ సేంద్రియ భాగ్యాన్ని కలిగిస్తాయా అంటే,  అనుమానమే. ఇంతటి దుస్థితిలో ఏమిటి మన కర్తవ్యం?

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : తృణధాన్యాలు, తిండిగింజల విషయం కాసేపు పక్కనపెట్టి, పండ్లు, కూరగాయలను మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తే, అవి ఎంత తాజాగా కనిపించినా నిజంగానే తినడానికే కాదు, కొనడానికి కూడా భయపడవలసి వస్తున్నది. ఎందులో ఎంత శాతం ‘పెస్టిసైడ్స్’ (పురుగు మందుల రసాయనాలు) అవశేషాలు వున్నాయో దేవుడికే తెలియాలి. పొరపాటున తెలుసుకొనే ప్రయత్నం చేస్తే మాత్రం వాటిని ముట్టడానికే మనకు చేతులు రావుకాక రావు. కంటికి ఆనకుండా మనం తిన్న ఆహార పదార్థాలలో నిక్షిప్తమై వున్న ఆ పురుగుమందుల రసాయనాలు కడుపులోకి వెళ్లి ఏం చేస్తాయో వేరే చెప్పాలా! 

హరిత విప్లవం పేరిట అధిక దిగుబడి కోసం ఎప్పుడైతే పరుగు మొదలైందో అప్పుడే మనం తినే ఆహారగింజలు, కాయలు, పండ్ల ఉత్పత్తులు కలుషితమవడం మొదలైంది. సాగులో వినియోగించే ఎరువులనుంచి పురుగుమందుల వరకు ప్రతిదీ రసాయనాల రూపుదాల్చిన దుష్ఫలిత విశ్వరూపం మామూలుది కాదు. తమ చేతులతో పిచికారి చేసే రైతు కార్మికులు, పర్యవసానాలలో పనులు చేసుకుంటున్న వారి నుంచి తత్ సంబంధ ఆహారం తినే ప్రతీ ఒక్కరి ఒంట్లోకి అవశేషాలు ప్రవేశించి దీర్ఘకాలం పాటు తిష్ట వేస్తాయని నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ బృహత్ దృశ్యం ఎంత భయానకమో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. 

కావాలని  ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలని ఎవరమూ అనుకోం. కానీ, అసలు వాస్తవాలు వేరే వున్నాయి. చాలావరకు మార్కెట్లలో లభ్యమయ్యే కూరగాయలు, పండ్లు చూడటానికి ఎంతో తాజాగానే కనిపిస్తాయి. దేశీయ ఉత్పత్తులకు తోడు సంకర, విదేశీ జాతులు. ఆకుకూరలు సైతం వెంటనే వండుకోవాలన్నంతగా మురిపిస్తాయి. ఒక దశలో అసలు సహజమైన వాటిని సైతం ‘ఇవి’ మించి పోతున్నాయంటే ఆశ్చర్యమే మరి. ఏ కూరగాయనైనా, మరే పండునైనా ఎట్టి పరిస్థితుల్లో తొక్కలతో తినకూడదని, బాగా కడిగి వాడుకుంటేనే (కొంతలో కొంతయినా) ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు చాలాకాలంగా సలహాలైతే ఇస్తున్నారు. వాటిని పాటిస్తున్న వారు ఎందరు? దాదాపు అందరం సాధ్యమైనంతలో అందుబాటులో వున్నవాటినే, శుచి శుభ్రతతో కూడినవే, ఏరి కోరి ఎంచుకొని, కడిగి మరీ తింటుంటాం. అయినా, వాటిలోని అవశేషాలు పూర్తిగా పోవడం లేదని, వాటి వాడకాన్ని నిషేధించడం తప్ప మరో మార్గమే వద్దని నిపుణులు సూచిస్తున్నారు. పంటలకు పట్టిన తెగుళ్లను చంపబోయి మనల్ని మనమే చంపేసుకుంటున్నామా అంటే అవుననే అనవలసి వస్తుంది. మనం కూచున్న కొమ్మను మనమే పనికట్టుకొని, విధిలేక నరుక్కుంటున్న చందం ఇది. పెస్టిసైడ్స్ అస్సలుకే వాడకుండా పంటలు పండించలేమా? అంటే అదేం లేదు, నిక్షేపంగా పండించుకోవచ్చు. కానీ, అంత ఓపిక, సౌకర్యాలు, పరిస్థితులకు రైతులు దూరమై చాలాకాలమే గడుస్తున్నది.

పూర్తిగా ఏది ప్రకృతి సిద్ధం? ఏది రసాయన మిళితమో తెలియని గందరగోళ పరిస్థితి. కంటికి కనిపించని విషాణువులు తొడిమెలు, తొక్కలనుండి గుజ్జు, రసాల వరకూ సర్వత్రా (ఎంతో కొంత) వ్యాపించి వుంటున్నట్టు అనేక ప్రామాణిక పరిశోధనల్లో తేటతెల్లమైంది. ప్రజలు ఎక్కువగా వాడుతున్న పాలకూర, బెండకాయ పంటలు అత్యధికంగా పెస్టిసైడ్స్ బారిన పడుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

 దోర్బల బాలశేఖరశర్మ


బాబోయ్ బెండకాయలు!


బెండకాయ పంటలపై పురుగుమందుల వాడకం అత్యధిక స్థాయిలో జరుగుతున్నట్టు ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. సుమారు పద్దెనిమిది రకాల పెస్టిసైడ్స్ అవశేషాలు అంతర్జాతీయ స్థాయిలో వివిధ బెండకాయల నమూనాల్లో బయటపడ్డట్టు చెబుతున్నారు. తెగుళ్ల నివారణకు అధిక దిగుబడి లక్ష్యంగాగల ఆయా ప్రాంతాల రైతులు రకరకాల పెస్టిసైడ్స్‌ను చల్లుతున్నట్టు వ్యవసాయ పరిశోధకులు గుర్తించారు. బెండపంటపై ప్రధానంగా ఆర్గనోక్లోరిన్, ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైరెథ్రాయిడ్, నియోటీ పురుగుమందు గ్రూపులను వాడుతున్నట్టు వారు తెలిపారు. బెండకాయను పొట్టు తీసి వండే అవకాశమే లేదు. కనీసం కడగడం కూడా సాధ్యపడదు. వాటిని నీళ్లలో వేస్తే జిగటగా మారుతుంది. ఒక వస్త్రంతో తుడిచి, తరిగి పొయ్యిమీద వేయడమే చాలామంది చేస్తారు. ఫ్రై (వేపుడు కూర) అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది బెండకాయనే.

సహజ రుచులు కనుమరుగు

లేత బెండకాయలు వండాక వచ్చే కమ్మటి వాసన ఎలా వుంటుందో ప్రస్తుతం అరవై ఏళ్ల పైబడిన వారికి బాగా తెలుసు. ఆ రుచి ఇప్పుడు వాటిలో కనుమరుగైంది. బారెడుగా పెరిగిన బీరకాయలను తరిగితే కరకర ముదురు చప్పుడు వస్తుంది. టమాటలో గట్టి గుజ్జు తప్ప రసం రావడం లేదు. యాపిల్ పండ్లలో అయితే నునుపుగుజ్జు తప్ప తియ్యదనమే కొరవడింది. ఇలా చెబుతూ పోతే, ప్రతీ పండు, కాయకూర పరిస్థితి ఇంచుమించు ఇలాగే తయారైంది. చాలామంది ఆశగా ఎదురుచూసే పన్నీర్ కర్రీ కోసం వినియోగించే పాలకూర సైతం ఇప్పుడు రసాయనాల బారిన పడినట్టు వార్తలు వింటున్నాం.


పదేళ్లుగా  యాపిల్  పండ్లు బ్యాడ్!

ఒకప్పుడు యాపిల్ పండ్లు అక్కడక్కడ మాత్రమే అమ్మకానికి కనిపించేవి. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా, చిన్న పెద్ద సైజుల్లో తేలికపాటి ధరల్లోనే లభ్యమవుతున్నాయి. ఇదెలా సాధ్యమైంది? అసలు అవి అంతగా ఎలా పండుతున్నాయి?? ఆలోచిస్తే 

భయమేస్తుంది మరి. అంతర్జాతీయ స్థాయిలో లాభాపేక్ష రహిత సంస్థగా పేరొందిన 

‘ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్’ (ఈడబ్లుజి) ప్రజాబాగు కోసం ఏటా 

పరిశోధనాత్మకంగా ప్రకటించే ‘అత్యంత అధమ స్థాయి ఆహార ఉత్పత్తుల’లలో 

గత పదేళ్లుగా యాపిల్ పళ్లు టాప్‌లో నిలిచాయంటే వాటి 

దుస్థితిని ఊహించుకోవచ్చు.

కూరగాయలు, పండ్లు, ఆహార ఉత్పత్తులలో పురుగుమందుల అవశేషాలు

బతికినన్నాళ్లు అవి మనతోనే!

అటు పర్యావరణాన్ని, ఇటు జంతువులు, పశువులతో సహా మనుషుల శరీర ధర్మాలను పురుగుమందుల రసాయనాలు, వాటి అవశేషాల ఆహారం పెద్ద ఎత్తున నిర్వీర్యం చేస్తున్న తీరు అత్యంత బాధాకరం. ఆహార ప్రక్రియ పరిణామ క్రమం(ఫుడ్ సైకిల్)లోకి పెస్టిసైడ్స్ విషాలు ‘పెద్దర్వాజ’ (అధికారికంగానే) గుండానే చొరబడటాన్ని శాస్త్రవేత్తలు ‘బయోఅక్యుములేషన్’ అంటున్నారు. మిగిలిన పశు, వృక్ష, పక్షి, జంతు జీవజాతుల మాట దేవుడెరుగు, మనుషులకు దీనివల్ల జరుగుతున్న ‘ఆరోగ్య నష్టం’ పూడ్చుకోలేనంత స్థాయిలో వుంటున్నట్టు నిపుణులు అంటున్నారు. మన దేహాలలోకి వెళ్లిన ఈ రసాయన విషకణాలు జీర్ణం కాకపోగా, కొవ్వులో పేరుకు పోయి, అలా బతికివున్నంత కాలం హాని చేస్తూ, మనలను మరణానికి చేరువ చేస్తున్నట్టు వారు చాలా కటువుగానే కుండబద్దలు కొడుతున్నారు. ఈ విపరీత పరిణామం ఎంత హానికరమో తెలుసుకుంటే మన మానసిక ఆందోళన రెట్టింపు అవుతుంది. 

ఒక ప్రామాణిక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విషతుల్యమైన పురుగుమందుల రసాయనాల బారిన (అనుకోకుండానే) పడుతున్న వ్యవసాయ కార్మికుల సంఖ్య ఏడాదికి ౩౮.౫ కోట్ల వరకు వుంటున్నది. ఈ మందులను పిచికారి చేసే రైతు కార్మికులు తమకు తెలియకుండానే ఆ అణువులను గాలితో పీల్చేస్తారు. పర్యవసానంగా కొన్నాళ్లకు దాని దుష్పరిణామాలు బయటపడతాయి. తలనొప్పి, మైకం, వికారం, వాంతులు, చర్మంపై మంటలు పుట్టడం వంటి అనేక అనారోగ్య లక్షణాలు వారిలో పొడసూపుతాయి. పెస్టిసైడ్స్ అవశేషాలతో పండిన ఆహార ఉత్పత్తులను తెలిసో, తెలియకో తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతున్నారు.

ఈ దుష్ప్రభావం నెలలు, సంవత్సరాల పాటు వుంటున్నట్లు వైద్య నిపుణులు తేల్చారు. అతిసార నుంచి మరణం వరకూ పరిస్థితి దారితీయవచ్చుననీ వారంటున్నారు. రోగనిరోధక శక్తి నుంచి పునరుత్పాదక శక్తి వరకు, శిశుజనన హాని మొదలు హార్మోన్‌లకు కీడు జరగడం వరకు, డయేరియా నుంచి క్యాన్సర్ వరకు, ఇంకా ఎన్నో మొండి వ్యాధులకు ఆస్కారం వుంటున్నది. శిశువులు, పిల్లలపై అయితే, ఇది మరింత అత్యధిక ప్రభావం            చూపుతుంది.

క్యాబేజీనుంచి కూరమిరప వరకు!

ఎప్పటిలా 2023 సంవత్సరంలో ‘ఈడబ్లుజి’ సంస్థ ప్రజా ప్రయోజనార్థం ‘డర్టీ డజన్ ఫుడ్స్’ జాబితాలోని పండ్లు, కూరగాయలను తాజాగా ప్రకటించింది. ఇందులో ‘స్ట్రాబెర్రీ’ ప్రథమస్థాయిలో నిలవగా, పాలకూర రెండో స్థానాన్ని పొందడం గమనార్హం. అధ్యయనానికి వాడిన వాటిలో సుమారు ౩౦ శాతం స్ట్రాబెర్రీ నమూనాలలో పది, అంతకు మించిన సంఖ్యలో వివిధ రకాల పెస్టిసైడ్స్ అవశేషాలు లభ్యమైనట్టు ‘ఈడబ్లుజి’ పరిశోధకులు తెలిపారు. ‘డర్టీ డజన్ ఫుడ్స్ జాబితాలో ఈసారి చిట్టచివరి స్థానం యాపిల్ పండుది. మూడునుంచి తర్వాతి స్థానాలను వరుసగా ‘కాలే’, ఆవాలు, క్యాబేజీ వంటి ఆకుకూరలు, పీచుపండు, బేరి (నేరేడు రకం) పండు, నెక్టరైన్స్ (మకరందపు) ఫలాలు, యాపిల్, ద్రాక్ష, కూర మిరప, చెర్రీ (నేరేడు రకానికి చెందిన ఎర్రరంగు పండ్లు), బ్లూబెర్రీ, ఆకుపచ్చ చిక్కుడు వున్నాయి. చాలావరకు సంప్రదాయ పండ్లు, కూరగాయలలో పెద్ద మొత్తంలో పురుగుమందుల అవశేషాలు వుంటున్నట్టు 

‘ఈడబ్ల్యూజి’ వెల్లడించింది.

పొంచివున్న మరింత పెద్ద ముప్పు

ప్రపంచవ్యాప్తంగా సుమారు ౧,౦౦౦ రకాలకు పైగా పెస్టిసైడ్స్ వినియోగం జరుగుతున్నట్టు ‘డబ్లుహెచ్‌ఓ’ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) నివేదిక చెబుతున్నది. అత్యంత సర్వసాధారణ పెస్టిసైడ్స్‌లలో హెర్బిసైడ్స్ (౪౯ శాతం), ఫంగీసైడ్స్, బ్యాక్టీరియాసైడ్స్ (౨౭ శాతం), ఇన్‌సెక్టిసైడ్స్ (౧౯ శాతం) వున్నాయి. ప్రపంచస్థాయిలో పురుగుమందుల వినియోగం ౧౯౯౦లో ౩.౭౨ బిలియన్ పౌండ్లు (౧౬౯ కోట్ల కిలోలు) వుండగా, రెండు దశాబ్దాల (౨౦౨౦) నాటికి ౫౭ శాతం పెరుగుదలతో ౫.౮౬ బిలియన్ పౌండ్ల (౨౬౬ కోట్ల కిలోలు)కు చేరింది. మున్ముందు ఇది ఒక దగ్గర ఆగేలా కనిపించడం లేదు. ౨౦౫౦ నాటికి ప్రపంచ జనాభా ౯.౫ బిలియన్ (౯౫౦ కోట్లు)లకు చేరుకొంటున్న తరుణంలో సుమారు ౬౦ శాతం మేర ఆహార ఉత్పత్తిని పెంచుకోవలసి వుంటుంది. ఈ డిమాండ్ నుండి గట్టెక్కడానికి (లేదా అవసరాన్ని అధిగమించడానికి) రైతులు మరింత ఎక్కువ పాళ్లలో పెస్టిసైడ్స్‌ను వినియోగించక తప్పదని పరిశోధకులు భావిస్తున్నారు.

రైతులే మూల బాధితులు

ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడో వంతుమేర వ్యవసాయ ఉత్పత్తులు పురుగుమందుల అవశేషాలను కలిగి వుంటున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి బాధితుల్లో ఎక్కువగా రైతులే వుంటున్నారు. సుమారు ౪౯ శాతం మేర బాధితులు వాసన శక్తిని సైతం కోల్పోతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాలనుంచి పండ్లవరకు, కూరగాయలనుంచి తృణధాన్యాలు, తిండిగింజలదాకా ఏవీ ‘రేషన్’ (నియంత్రణ) అన్నదే లేకుండా బహిరంగ మార్కెట్లలో (ఎంతోకొంత ధరకు) ఎలా లభ్యమవుతున్నాయి? అధిక ఉత్పత్తి లేదా కనీస దిగుబడి కోసం సగటునుంచి మోతుబరు రైతులవరకు అందరూ రసాయనిక పోషకాలు, పెస్టిసైడ్స్ వాడక తప్పని పరిస్థితిలో 

ఫలితాలు దయనీయంగా వుంటున్నాయి.

ఉద్యమ ఊపు ఎక్కడ?

పంటకు తెగుళ్లు సోకడం సహజం. ‘ఆ పురుగులను ఎలా నాశనం చేయాలి?’ అన్నదే ఇక్కడ ప్రధానం. సేంద్రియ పద్ధతిలో తయారైన మందులను తయారుచేసి వాడే ఓపిక ఎందరు రైతులకు ఉంటున్నది? ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి వ్యవసాయదారులు అందరూ పని కట్టుకొని గత రెండు దశాబ్దాలుగా జరుపుతున్న ‘సేంద్రియ సాగు ఉద్యమం’ ఒకవైపు ఊపందుకుంటున్నప్పటికీ, భారతదేశం వంటి పలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆయా ప్రభుత్వాలు ఈ బృహత్ కార్యాన్ని తమ సామాజిక, గురుతర బాధ్యతగా భుజానికెత్తుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా వంటి అగ్రదేశాల్లో పెరుగుతున్నంత ‘సేంద్రియ సాగు స్పృహ’ బడుగు దేశాలలో కొరవడుతున్నది. దీంతో నిషేధిత పెస్టిసైడ్స్ వాడకం అన్ని దేశాలలోనూ అమలు కావడం లేదు.

ఇందుకు ఉదాహరణ మన దేశమే. ‘కొన్ని రకాల పురుగుమందుల వాడకంపై అంతర్జాతీయంగా పలు దేశాలలో నిషేధం విధించినప్పటికీ మన దేశంలో వాటిలో కొన్నింటిని వినియోగించడానికి అనుమతిస్తున్నారని, ఇది ప్రజలకు తీవ్ర అనారోగ్యదాయకమని’ చెబుతూ ఈ పరిస్థితిపై నివేదిక (స్టేటస్ రిపోర్ట్) ఇవ్వవలసిందిగా కిందటేడాది (౨౦౨౩) జనవరిలోనే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, యూరొపియన్ వ్యవసాయ విధానాలపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మొత్తం మీద పెస్టిసైడ్స్‌ను వదిలేసుకోవడం ద్వారా పంట దిగుబడి పండ్ల ఉత్పత్తిలో ౭౮ శాతాన్ని, కూరగాయలలో ౫౪ శాతాన్ని, ధాన్యం గింజలలో ౩౨ శాతాన్ని నష్టపోవలసి వస్తున్నట్టు తేలింది.

డర్టీ డజన్-2023 ఫుడ్స్ జాబితా

స్ట్రాబెర్రీ

పాలకూర

ఆవాలు, క్యాబేజీ వంటివి

పీచుపండు

బేరి (నేరేడు రకం) పండు

నెక్టరైన్స్ మకరందపు ఫలాలు

యాపిల్

ద్రాక్ష 

కూర మిరప 

చెర్రీ

బ్లూబెర్రీ

ఆకుపచ్చ చిక్కుడు