శుద్ధి యురేనియానికి ఇరాన్ స్వస్తి!
వదులుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకారం
వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య అతిత్వరలో ఒప్పందం?
వాషింగ్టన్, మే 24: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించడానికి అమెరికాతో చర్చలు జరుపుతున్న విస్తృత శాంతి ఒప్పందంలో భాగంగా, తన వద్ద ఉన్న సుసంపన్నమైన స్వచ్ఛమైన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు ‘ది న్యూయార్క్ టైమ్స్’కు వెల్లడించారు. శత్రుత్వాన్ని అంతం చేసి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా వాషింగ్టన్, టెహ్రాన్ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు దగ్గరలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ శనివారం ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపాదిత ఒప్పందం వివరాలను ట్రంప్ వెల్లడించనప్పటికీ, యురేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికా రులు తెలిపారు.
దీంతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య అతిత్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్ధాన్ని ముగించి.. హోర్ముజ్‌ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారికంగా ఒప్పందం కుదిరిన తర్వాత యురేనియం నిల్వలను నిర్వీర్యం చేసే విధానాలపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ప్రకారం.. ఇరాన్ వద్ద 60శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం ఉన్నట్లు అంచ నా. ఈ నిల్వల్లో అధిక భాగం ఇస్పహాసన్ అణు కేంద్రంలోని భూగర్భంలో ఉంచినట్లు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా-, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్‌లో పర్యటిస్తున్న తమ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. ఇరువర్గాల మధ్య తుది ఒప్పందానికి దాదాపు రంగం సిద్ధమైందని తెలిపింది.






