29 May, 2026 | 2:53 AM

సీబీఎస్‌ఈ దుమారం!

29-05-2026 12:00 AM

నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనను మరువకముందే సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడం మన దేశ విద్యావ్యవస్థలోని లోపాలను మరోసారి బహిర్గతం చేసింది. ముఖ్యంగా పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలపై చాలామంది విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎమ్) విధానంలోని లోపాలే ఇందుకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది సంప్రదాయ పద్ధతికి భిన్నంగా జవాబు పత్రాలను డిజిటల్ రూపంలోకి మార్చి మూల్యాంకనం చేసే ఓఎస్‌ఎం విధానాన్ని  సీబీఎస్‌ఈ అవలంబించిన విషయం తెలిసిందే. ఇదే ఈ సమస్యకు కేంద్రబిందువుగా మారిందని చెప్పవచ్చు. మే 13న వెలువడిన ఫలితాల్లో కొన్ని సమాధాన పత్రాలు స్పష్టంగా కనిపించకపోవడం, ఒకరి జవాబు పత్రాలు మరొకరికి జతవడం, కొందరికి చాలా తక్కువ మార్కులు రావడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేదాంత్ శ్రీవాత్సవ అనే విద్యార్థి ఈ అవకతవకలను సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేయగా, ఆయనపై పాకిస్థాన్ ఏజెంట్ అనే ముద్రవేయడం పెనుదుమారం రేపింది. అదే సమయంలో రీవాల్యూయేషన్, జవాబు పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్ ఓపెన్ కాకపోవడం ఈ సమస్య తీవ్రతను మరింత పెంచింది. కాగా, సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్పిన కేంద్ర విద్యాశాఖ మంత్రి.. మొత్తం వ్యవస్థ విఫలమైందని అంగీకరించకపోవడం గమనార్హం.

2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల వివాదానికి కారణమైన సంస్థకే సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎమ్ బాధ్యతలు కట్టబెట్టిన విషయాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వేలాది మంది విద్యార్థుల మార్కులను తప్పుగా చూపించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు సీబీఎస్‌ఈ విషయంలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తున్నది.

ఈ వివాదం తర్వాత పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతపై మళ్లీ చర్చ మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో చిన్న లోపం కూడా పెద్దగా ప్రభావం చూపుతుంద నడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, డిజిటలైజేషన్ అవసరమైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పారదర్శకత, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని ఈ వివాదం మరోసారి నొక్కిచెప్పింది.