సబ్బండ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ధోకా
భారతదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ అనేది పేదరిక నిర్మూలన పథకం కాదు. అది సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, చారిత్రక అన్యాయాల పరిహారం కోసం రాజ్యాంగం కల్పించిన ఒక ప్రత్యేక సాధనం. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ఆలోచనల ప్రకారం రిజర్వేషన్లు అనేవి శతాబ్దాలుగా సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అణచివేతకు గురైన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి రూపొందించినవి.
కేంద్ర ప్రభుత్వం 2019లో ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లు భారత రిజర్వేషన్ విధా నంలో ఒక కొత్త మలుపు అని చెప్పాలి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్గాల కు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేయడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ అంశం మరింత వివాదాస్పదం గా మారింది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే:
103వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(6), 16(6)లను చేర్చి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందని ఆర్థికంగా బలహీనవర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించారు. సంవత్సరానికి రూ. 8 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు, నిర్దిష్ట స్థిరాస్తి పరిమితుల్లో ఉన్నవారు దీనికి అర్హు లు.ఇది భారతదేశంలో మొదటిసారి సామాజిక వెనుకబాటు కాకుండా ఆర్థిక వెనుకబా టు ఆధారంగా తీసుకొచ్చిన రిజర్వేషన్ కావ డం గమనార్హం. ఈ వర్గాలు ఏనాడు కులవ్యక్షతను ఎదుర్కోలేదు. సామాజిక వెనుకబా టుతనం అసలు లేదు. ఉద్యోగాలలో మెజారిటీ, అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేష న్లు అమలు పరుస్తున్నారు ఈ దేశంలో. అం దుకే చట్టాలు ఈ దేశంలో ఉన్నత వర్గాల ఉన్నతి కోసమే తయారవుతాయనే అభిప్రా యం ఉన్నది. ‘వడ్డించే వాడు మన వాడైతే చాలు’ అనే సామెత ప్రకారం భారత రాజ్యాంగాన్ని మార్చి తమ వర్గాల కోసం పట్టుబట్టి మరి అమలు చేస్తున్నారు.
తెలంగాణలో 2021లో అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వం లోని ప్రభుత్వం రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 33 ప్రకారం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగా ల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 50 నుంచి 60 శాతానికి పెరిగింది.
తెలంగాణలో జనాభా నిర్మాణం:
తెలంగాణలో సామాజికవర్గాల వారీగా జనాభా శాతాన్ని పరిశీలిస్తే: ఎస్సీలు 17.43%, ఎస్టీలు బీసీలు (ముస్లింలతో కలిపి) ఓసీలు 15.79 శాతం. అయితే ఈ 15.79 శాతంలో కులం చెప్పని సుమారు 12,04,000 మందిని తీసివేస్తే, తెలంగాణలో వాస్తవ ఓసీ జనాభా సుమారు 43,97,515 మాత్రమే. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో వారి శాతం సుమారు 12.35% మాత్రమే. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ 12.35 శాతంలో కూడా సంవత్సరానికి రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను, స్థిర, చర ఆస్తులు కలిగి ఉన్న వారిని తీసివేస్తే, నిజమైన ఈడబ్ల్యూఎస్ అర్హుల శాతం సుమారు 4% వరకు మాత్ర మే ఉంటుందనేది వాస్తవం. ఇదే విషయం తెలంగాణ సామాజిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024 స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితిలో కేవలం 4% జనాభాకు 10% రిజర్వేషన్ ఎలా ఇస్తారనే ప్రశ్న తెలంగాణలో బలంగా వినిపిస్తోంది. ఈ రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే 4 శాతం ఉన్న ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి 56.33% ఉన్న బీసీలకు ఎందుకు 29% రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారు? ఇదేమి సామాజిక న్యాయం? అని బీసీలు ప్రశ్నిస్తున్నారు.
కటాఫ్ మార్కుల వివాదం
ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయిం చిన సీట్ల సంఖ్య అర్హుల సంఖ్యతో పోలి స్తే అధికంగా ఉండటం వల్ల అనేక పోటీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉంటు న్నాయని విద్యార్థి వర్గాలు, సామాజిక సంఘాలు విమర్శిస్తున్నా యి. కొన్ని సందర్భాల్లో ఎస్టీ కటాఫ్ మార్కుల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ కటాఫ్ మార్కులు తక్కువగా ఉన్నాయ నే చర్చ జరుగుతోంది.
ఉదాహరణకు, ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ పరీక్ష ఫలితాలను విశ్లేషిస్తే, రిజర్వేషన్ వ్యవస్థలో ఉన్న అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నా యి. ఓసీ అభ్యర్థులు 417వ ర్యాంక్ వరకు సెలెక్ట్ కాగా, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 758వ ర్యాంక్ వరకు ఎంపికయ్యారు. అదే సమయంలో బీసీ- 830వ ర్యాంక్, బీసీూ 436వ ర్యాంక్, బీసీ 446 వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యారు. అంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన అభ్యర్థులు బీసీ- బీసీ వర్గాల కంటే తక్కువ మెరిట్ ర్యాంక్ వచ్చి నప్పటికీ ఎంపిక కావడం గమనార్హం. అదేవిధంగా మొత్తం 562 గ్రూప్ పోస్టుల్లో ఓసీలు 108 మంది ఎంపికయ్యారు.
అంటే 19.2 శాతం. మరి 12.5% జనాభాకు తగినంత ప్రాతినిధ్యం లభించినట్లే. అలాగే ఈడ బ్ల్యూఎస్ కోటాలో 64 మంది ఎంపికయ్యా రు. అంటే మొత్తం 172 మంది ఎంపికైనట్లు లెక్క. తెలంగాణ రాష్ట్రంలో 12.5% కూడా లేని ఓసీలు ఈ 31% పోస్టుల్లో ఎంపికవడం ఏ సామాజిక న్యాయానికి నిదర్శనమని బహు జనులు ప్రశ్నిస్తున్నారు. ఇక రిజర్వేష న్ల అసలు ఉద్దేశమైన సామాజిక న్యాయం, చారిత్ర క వెనుకబాటుతనానికి, అణచివేతకు పరిహారం అనే సూత్రాలపై ఇది ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది. దీనివల్ల రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయ సాధనమా? లేక అవకాశాల అసమాన పంపిణీయా? అనే ప్రశ్న మరింత బలపడుతోంది.
డేటా లేకుండానే అమలు?
తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసేముందు రాష్ట్రస్థాయి సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే ఆధారంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయలేదని విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో: 1. నిజమైన ఈడబ్ల్యూఎస్ జనాభా ఎంత? 2. వారికి ఉన్న విద్యా వెనుకబాటు ఎంత? 3. ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? 4. రిజర్వేషన్ అవసరం ఎంత వరకు ఉంది? అనే అంశాలపై ఎలాంటి సమగ్ర ఎంపిరికల్ డేటా లేదా క్వాంటిఫైబుల్ స్టడీ లేకుండానే అమలు పరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 10% ప్రమాణాన్ని తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా అమలు చేసింద ని, కానీ రాష్ట్ర సామాజిక నిర్మాణానికి అనుగుణంగా ప్రత్యేక విశ్లేషణ జరగలేదని అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈడబ్ల్యూఎస్ చరిత్ర- ఇది:
1991 సెప్టెంబర్ 25న అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కేంద్ర ప్రభుత్వ సివిల్ పోస్టుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక మెమో జారీ చేశారు. ఈ మెమో రాజ్యాంగబద్ధతను పరిశీలించిన ఇందిరా సహాని వర్సెస్ యూని యన్ అఫ్ ఇండియా కేసులో తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 8- మెజారిటీతో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లను కొట్టివేసింది. ఎందుకంటే రాజ్యాంగంలోని రిజర్వేషన్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఉద్దేశించినవని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి, కొన్ని రోజుల వ్యవధిలోనే రిజర్వేషన్లను అమలు చేసింది: జనవరి 7 కేంద్ర క్యాబినెట్ ఆమోదం.
జనవరి 8 లోక్‌సభ ఆమోదం. జనవరి 9 రాజ్యసభ ఆమోదం. జనవరి 11 రాష్ట్రపతి ఆమోదం. జనవరి 14 దేశవ్యాప్తంగా అమలు జరిగిం ది. వాస్తవానికి చట్టంలో ‘10% వరకు’ అని పేర్కొన్నప్పటికీ, దాదాపు అన్ని రాష్ట్రాలు పూర్తి 10% రిజర్వేషన్లు అమలు చేస్తున్నా యి. తెలంగాణ శాసనసభ, గవర్నర్ ఆమోదంతో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల బిల్లు తొమ్మిదవ షెడ్యూల్‌లో పెట్టడానికి పంపి సంవత్సరమైనా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వారం రోజుల్లో అమలు చేసింది. ఇది పాలకులకు బీసీలపై ఉన్న ప్రేమ.
ఇతర రాష్ట్రాల వైఖరి:--
దేశంలోని అనేక రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, తమిళనాడు రాష్ట్రం మాత్రం స్పష్టంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకించింది. అమలు చేయడం లేదు. అదే విధంగా కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ రిజర్వేషన్లను అమలు చేయడం లేదు. అసోం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
రాజ్యాంగపరమైన ప్రశ్నలు-:
రిజర్వేషన్లు అనేవి ‘తగినంత ప్రాతినిధ్యం లేని వర్గాలకు’ దామాషా ప్రాతిపదికన ఇవ్వాలా? అనే అంశాన్ని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు విశ్లేషించింది. అదే కేసులో మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని ధర్మాసనం పేర్కొంది. కానీ, ఈడబ్ల్యూఎస్ అమలుతో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాయి. అలాగే జన హిత వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3- మెజారిటీతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది. అయితే అప్పటి చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు అభిప్రాయం- ఇలా:
సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో రిజర్వే షన్లు ఇవ్వాలంటే ఎంపిరికల్ డేటా, క్వాంటిఫైబుల్ డేటా అవసరమని స్పష్టం చేసింది. అందులో ముఖ్యమైన కేసులు: 1. ఎం. నాగరాజు వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా 2. జర్నేల్ సింగ్ వర్సెస్ లక్ష్మినారాయణ గుప్తా 3. జయశ్రీ లక్ష్మిపాటిల్ వర్సెస్ మహారా ష్ట్ర ఈ తీర్పులన్నీ డేటా ఆధారిత రిజర్వేషన్ల అవసరాన్ని నొక్కి చెప్పా యి. కానీ, తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ అమలు విషయంలో అలాంటి సమగ్ర డేటా అందుబాటులో లేకపోయిన ప్పటికీ అమలు చేయడం పెద్ద ప్రశ్నగా మారింది.
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఒక సాధారణ పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, అది సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధత, ప్రాతినిధ్యం, సమాన అవకాశాలపై ఒక పెద్ద చర్చకు దారితీసిన అంశం. 4 శాతం కూడా లేని జనాభాకు 10% రిజర్వేషన్ ఇవ్వడం సరైందా? ఎంపిరికల్ డేటా లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగబద్ధమా? రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనానికి పరిష్కారమా? లేక ఆర్థిక పేదరికానికి ప్రత్యామ్నాయ సంక్షేమ పథకమా? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడం ఇప్పుడు తెలంగాణ సమాజం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ముందున్న కీలక బాధ్యత.
నిజానికి ఈ రిజర్వేషన్ల వలన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోంది. అలాగే అధికాదాయం గల ఆధిపత్య కులాలు తక్కువ ఆదాయమని సృష్టించే తప్పుడు సర్టిఫికెట్లతో నిజమైన అల్పాదాయ ఓసీ వర్గాలు కూడా నష్టపోతున్నాయి. అందుకే ఈ రిజర్వేషన్లపై సమీక్ష అవసరం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని వాస్తవ ఈడబ్ల్యూఎస్ జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులు, ప్రాతినిధ్య స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయించి, ఆ నివేదిక ఆధారంగా శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్






