సిర్పూర్‌లో చెల్లని రూపాయి కందనూలులో చెల్లుతుందా?

23-04-2024 12:28:45 AM

l బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క ఆర్‌ఎస్పీకి అవకాశం  

l ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్

నాగర్‌కర్నూల్,  ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సిర్పూర్‌లో చెల్లని రూపాయి కందనూలులో చెల్లుతుందా అని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఎద్దేవాచేశారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోర ఓటమిపాలైన ఆర్‌ఎస్పీ బీఆర్‌ఎస్ తరఫున ఇక్కడా ఓడిపోవడం ఖాయమన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజలతో ముచ్చటించారు.

ఉద్యమ పార్టీ అని గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను నిండా ముంచిన పార్టీ బీఆర్‌ఎస్‌కు నేడు ఎన్నికల సమయంలో అభ్యర్థులు కూడా కరువయ్యారని అన్నారు. చివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వ్యక్తి ఒక్కరిని కూడా గెలిపించుకోలేక పోయిన ఆర్‌ఎస్పీకి టికెట్ ఇచ్చారని ఎద్దేవాచేశారు. దేశమంతా మోదీవైపు చూస్తున్న దని చెప్పారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా తాను గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు.