17 May, 2026 | 12:03 PM

కలెక్టర్‌గా దుబ్బాక ఉసురుపోసుకుండు

23-04-2024 12:25 AM

l వెంకట్రామ్‌రెడ్డి ఈ ప్రాంతానికి అన్యాయం చేశాడు

l ఐదునెలలుగా క్యాంపు ఆఫీస్ తాళం తీయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

l ఇంటింటి ప్రచారంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు

సిద్దిపేట, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ప్రాజెక్టుల పేరుతో దుబ్బాక నియోజకవర్గ రైతుల భూములు తీసుకుని ఈ ప్రాంత ప్రజల ఉసురుపోసుకున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆయన బీజేపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా పనిచేసి, అనంతరం ఎమ్మెల్సీగా నాలుగేండ్లు కాకముందే వందకోట్లతో సేవ చేస్తానంటున్నారని, అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్‌చేశారు. దుబ్బాక ప్రాంత ప్రజల ఉసురుపోసుకోవడమే తప్ప చేసిన మేలు ఏమీ లేదని ధ్వజమెత్తారు.

రైతు మల్లారెడ్డి మల్లన్నసాగర్ భూముల్లో స్వయంగా చితిపేర్చుకుని చనిపోయినా గుండెలో తడిలేని మనిషి వెంకట్రామిరెడ్డి అని ఆగ్రహించారు. కాలువలు సగంలో ఆగిపోయాయి, నీళ్లు రావడం నిలిచిపోయాయి, భూములను లాక్కున్నారు, ఇలా అన్నివిధాల దుబ్బాకకు కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డి అన్యాయం చేశారని విమర్శించారు. వాస్తు, ముహూర్తాలు లేవని 5 నెలల నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ తాళం కూడా కొత్త ప్రభాకర్‌రెడ్డి తీయలేదని ఆరోపించారు. దుబ్బాకలో సమస్యలు కోకొల్లలుగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.