బీజేపీ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పతనం

23-04-2024 12:29:52 AM

l కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్.. ప్రధాని రాహుల్‌గాంధీ

l రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యాయని, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. హాలియాలో సోమవారం కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మీడియా వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తున్నదన్నారు. రైతులు తాము పండించిన దిగుబడికి మద్దతు ధర కోసం ధర్నా చేస్తే ఏమాత్రం పట్టించుకోలేదని, అలాగే నిరుద్యోగ సమస్యనూ వదిలివేసిందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు.

గిరిజన యూనివర్సిటీ, బీబీనగర్ ఏయిమ్స్ కూడా ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయలేదన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంట దిగుబడికి మద్దతు ధర ఇస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. నెల్లికల్లి ఎత్తిపోతల పథకానికి 200 కోట్లు మంజూరు చేసి, రెండేళ్లలో 7 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ఎంపీగా గెలవగానే సాగర్ రిజర్వాయర్‌లో వాటర్ ఎయిర్ బ్రో ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడూతు.. తెలంగాణ ఇచ్చింది, ఉపాధి హామీ పథకం, విద్యాహక్కు చట్టం తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. పార్టీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనను గెలిపిస్తే కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేపడతానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, బాలూనాయక్, జైవీర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్  పాల్గొన్నారు.