గోరువెచ్చని నీళ్లు మంచివేనా?
మనం ఆరోగ్యంగా ఉండటానికి తినే ఆహారం మాత్రమే కాకుండా తాగే నీరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యానికి గోరువెచ్చని నీళ్లు మంచివేనా? అనే అనుమానం ప్రతిఒక్కరికీ రావచ్చు. ముఖ్యంగా కొంతమంది వేడి నీరు తాగడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి ఎవరు వేడి నీరు తాగొద్దో చూద్దాం..
* కొంతమంది ఆరోగ్య ప్రయోజనాలంటూ ఎక్కువగా గోరు వెచ్చని నీరు తాగుతారు. జీర్ణక్రియను మెరుగు పర్చడంతో పాటు.. కండరాల నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే దగ్గు, అసిడిటీ, జలుబు సమస్యలు దూరం అవ్వడంతో పాటు బరువు కూడా తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు.
* జలుబు, దగ్గు ఉన్నవారు మరీ ఎక్కువగా ఉన్న గోరువెచ్చని నీరు తాగకపోవడమే మంచిదంటున్నారు. వేడి నీరు తాగడం వలన వారి గొంతులో మంట, చికాకు పెంచుతుందట. జలుబు, దగ్గుతో అప్పటికే ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. ఎక్కువ వేడి నీరు కాకుండా కొంచెం వేడిగా ఉండే నీరు తాగడం బెటర్ అని.. అలా తాగడం వల్ల గొంతుకు కాస్తా ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
* చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఉన్న వేడి నీరును తాగకూడదు. ఎందుకంటే పెద్దవారితో పోలిస్తే చిన్నపిల్లలకు జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. వేడి నీటిని తీసుకోవడం ద్వారా వారికి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కేవలం సాధారణ నీరు మాత్రమే తాగాలి. లేదంటే కడుపు నొప్పి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
* లివర్ సమస్యతో బాధపడుతున్న వారు వేడి నీటిని తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి లివర్‌పై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుందని అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లివర్ చాలా సున్నితమైన అవయవం కాబట్టి దానిలో ఏదైనా సమస్య వస్తే.. అది శరీరంలోని మిగితా పార్ట్స్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు.
* దంతాల సున్నితత్వంతో బాధ పడేవారు వేడి ఎక్కువగా ఉన్న నీటిని తాగడానికి ఇబ్బంది పడతారు. ఎక్కువగా ఉన్న చల్లటి నీటిని తాగాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ కారణంగానే దంతాల సమస్య ఉన్నవారు సాధారణ నీటిని తాగితే బెటర్ అని అంటున్నారు.






