18-05-2025 12:00:00 AM
పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తున్నారు కదా.. మరి ఇంట్లో పెద్దవారికి? రోగ నిరోధక శక్తి సన్నగిల్లే పెద్ద వయసులో టీకా రక్షణ తప్పనిసరి అంటున్నారు వైద్యులు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
ఇప్పుడు 60 ఏళ్లు దాటిన పెద్దలకు కూడా టీకాల అవసరం ఉంది. అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. దీంతో రకరకాల వ్యాధులు దాడి చేస్తుంటాయి.
కొందరిలో ఇవి ప్రాణాంతకంగా మారతాయి. ఈ నేపథ్యం లో టీకాలు చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొనే వారిలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి వివిధ రకాల టీకాలు అందించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
ఫ్లూ..
వాన, చలి కాలాల్లో తరచూ వేధించేది ఫ్లూ.. దీన్ని ఇన్‌ఫ్లూయెంజా అంటారు. ఇందులో పలు రకాలు ఉన్నాయి. జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబుతో మొదలయ్యే ఫ్లూ వృద్ధులకు కొన్నిసార్లు ప్రాణాంతకమవుతుంది. క్యాన్సర్, ఆస్తమా, సీఓపీడీ, కిడ్నీ సమస్యలు, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ వైరస్ కారణంగా మృత్యువాతపడుతుంటారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఏటా ఒక డోసు ఫ్లూ టీకా తీసుకోవడం అవసరం.
షింగిల్స్
పెద్దల్లో ఎక్కువగా సర్పి దాడి చేస్తుంది. అప్పటికే శరీరంలో ఉన్న చికెన్ పాక్స్ వైరస్ మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు తిరిగి దాడి చేస్తుంది. చర్మంపై నీటి బుగ్గలు వచ్చి అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. రెండు, మూడు వారాల వరకు వేధిస్తాయి.
హెపటైటిస్ బి
హెపటైటిస్ బి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. శారీరక ద్రవాలతో ఇతరులకూ సోకుతుంది. కాలేయ క్యాన్సర్‌కు కారణం అవుతుంది. చిన్నపిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ వ్యాక్సిన్ అవసరమని సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు నెల రోజుల విరామంతో మూడు డోసులు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.