16 July, 2026 | 7:08 PM

హరోం హరకు అది శుభ సూచికం

12-06-2024 12:15 AM

రొమ్-కామ్ చిత్రమైన ‘సెహరి’తో దర్శకుడిగా పరిచయమయ్యారు జ్ఞానసాగర్ ద్వారక. స్వతహాగా మాస్ సినిమాల అభిమాని అయిన ఆయనకు ‘హరోం హర’ రూపంలో అలాంటి సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే దీనికి హీరో సుధీర్ బాబు, నిర్మాత సుమంత్ జి నాయుడు తోడవటం వలనే ఈ ‘మాస్ సంభవం’ జరిగిందంటున్నారు దర్శకుడు. ఈ నెల 14న ‘హరోం హర’ విడుదల కానున్న నేపథ్యంలో సినిమా గురించి పాత్రికేయులతో జ్ఞానసాగర్ పంచుకున్న ముచ్చట్లు.. 

హరోం హర ఎలా మొదలైంది?

సుధీర్ గారి భార్య నా తొలి సినిమా ‘సెహరి’ చూసి, ఈ దర్శకుడిని ఓసారి కలవమని సూచించారట. అదే సమయంలో నేను కూడా సుధీర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నా. ఇద్దరం కలిశాక తొలిదశ చర్చల్లోనే సినిమా ఖాయమైంది. మరోవైపు నిర్మాత సుమంత్ నా స్నేహితుడు. గత మూడేళ్ళుగా మా ప్రయాణం సాగుతోంది. సుధీర్‌ని కలిసి కథ చెప్పా అన్న వెంటనే ఈ సినిమా మనం చేద్దాం అని ఆయన అనడంతో ‘హరోం హర’ పట్టాలెక్కింది.

1990ల్లో సినిమా అంటున్నారు. నాటి కాలాన్ని తెరపై ఎలా చూపించబోతున్నారు?

ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకున్నాం. పూర్వ నిర్మాణ కార్యక్రమాలకే ఆరు నెలల సమయం పట్టింది. పీరియాడిక్ సినిమా అవడమే గాక, తుపాకీ వంటి ఆయుధాల తయారీ గురించి ప్రస్తావించనున్నాం గనక వాటిపైనా కొంత అధ్యయనం చేశాం. అప్పటి పరిస్థితులు ప్రతిబింబించేలా ఉండాలని కర్ణాటక, మంగుళూరు, ఉడిపి, ద్రాక్షారామంలో చాలావరకు చిత్రీకరణ జరిపాం. మిగిలిన భాగం సెట్స్‌లో చేశాం.

హీరో పాత్ర ఎలా ఉండనుంది?

జీరో నుంచి హీరో అయ్యే కథలంటే నాకు ఇష్టం. ఈ సినిమాలోనూ హీరో పాత్ర అదే విధంగా ఉండనుంది. కుప్పంలోని పాలిటెక్నికల్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసే సుబ్రహ్మణ్యం అనే ఒక సాధారణ యువకుడి ప్రయాణం తుపాకులు తయారు చేయడంతో మొదలై ఎక్కడ వరకు సాగింది అనేది సినిమాలో చూడవచ్చు. సుధీర్ గారు చాలా బాగా చేశారు. ఆయన పనితనం చూసిన తర్వాత ఎవరూ ఆయనలో ఈ యాంగిల్ వాడుకోలేదనిపించింది. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుడిని. కథానాయకుడి పేరు కూడా సుబ్రహ్మణ్యం. సినిమాలో కొంతమేర ఆధ్యాత్మిక కోణం ఉంటుంది. చిత్రీకరణ జరిపిన ప్రతి చోట మాకు నెమలి కనపడింది. అది శుభ సూచికం అని నమ్ముతున్నాను.

కథ వాస్తవ ఘటనలతో కూడుకున్నదా.. కల్పితమా?

వాస్తవ ఘటనల నుండి స్ఫూర్తి పొంది రాసిన కల్పిత కథ ‘హరోం హర’. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మామూలు వ్యక్తి తుపాకీ తయారు చేయడం, టెక్ మధు జీవిత ఘటనల నుండి కొన్ని విషయాలు తీసుకున్నాను. అయితే అవి మాత్రమే కథకి సరిపోవు గనక వాటికి మరికొన్ని అంశాలను జోడించడం జరిగింది. 

తుపాకీ తయారీ వంటివి ప్రేక్షకులపై ప్రభావం చూపనున్నాయా?

ఇందులో తుపాకీ తయారీ ఒక అంశం మాత్రమే. అది ఓ పాఠంలా చెప్పలేదు. ఆ సన్నివేశాలు సహజంగా ఉండటం కోసం మేము కొన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీస్ చూశాం. అంతేగానీ తుపాకుల పరిశ్రమ ప్రారంభించే విధంగా ఏం ఉండదు (నవ్వుతూ..) 

కథకు కుప్పం ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం? 

నేను పుట్టి పెరిగిన ప్రాంతమది. తమిళనాడు చాలా దగ్గరగా ఉన్న కుప్పంలో భాష, ఆహారంతో సహా సంస్కృతి, సంప్రదాయాలు మూడు రాష్ట్రాల కలగలుపుగా ఉంటాయి. వాటిని సినిమాలో పొందుపరిచాం. పాత్రలకి సంబంధించిన ప్రతి సంభాషణ ఆ ప్రాంత యాసలోనే ఉంటుంది. సుధీర్ గారు నాలుగు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేశారు. హీరోయిన్ నేర్చుకుని మరీ ఈ యాసలో తన డైలాగులు పలికారు. ఇతర నటీనటులు కూడా ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. కుప్పం మట్టి వాసన ఈ సినిమాలో ఉంటుంది.

‘హరోం హర’కి రెండో భాగం ఉంటుందా?

సినిమాలో మేం రెండో భాగం ఉంటుందని ప్రకటించడం లేదు. అయితే సినిమా చూశాక, ముఖ్యంగా ముగింపు సన్నివేశాల తర్వాత ఇది కొనసాగాలని ప్రేక్షకులు కోరతారు. దానిని బట్టి రెండో భాగం చేయనున్నాం.

మహేశ్ ఈ సినిమా చూశారా?

ఇంకా లేదు. అయితే ఆయనకి ట్రైలర్ బాగా నచ్చింది. విడుదల రోజున సినిమా చూస్తా అన్నారు. 

పాన్ ఇండియా సినిమాగా అనుకున్నట్టున్నారు..?

ముందు అలా అనుకున్న మాట నిజమే. అయితే టీజర్ చేస్తున్న సమయంలో కొన్ని విషయాలు తెలిసొచ్చాయి. ముఖ్యంగా భాష పరంగా.. కథలోని తీవ్రత ఆయా భాషల మాటల్లో ధ్వనించలేదు. దానితో ఆ ప్రయత్నం విరమించుకున్నాం. అలా చేయాలనుకున్నపుడు ముందు నుండి ఖచ్చితమైన ప్రణాళిక ఉంటే మంచిది.

విడుదల జూన్ 14కి ఎందుకు మారింది?

డిఐ పనులు ఆలస్యం కావడంతో మేము ముందుగా అనుకున్నట్టు మే 31వ తేదీకి రాలేకపోయాం. దాంతో జూన్ 14కి మార్చాం.

బడ్జెట్ సుధీర్ మార్కెట్‌ను దాటిందా..? 

కొంత ఎక్కువనే చెప్పాలి. అయితే సుధీర్ మార్కెట్ లెక్కలను పక్కన పెడితే ఈ కథకి అవసరమైన బడ్జెట్ నిర్మాతలు కేటాయించారు. యాక్షన్‌కి చాలా ఖర్చయింది. నిర్మాతలు స్నేహితులు కావడం నాకు కొంత కలిసొచ్చింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది. ‘సెహరి’ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ సురేశ్ సారంగం, ఎడిటర్ రవితేజ గిరిజాల ఈ సినిమాకి పనిచేశారు. సంగీత దర్శకుడు చైతన్‌తో కూడా మంచి స్నేహం ఉంది. 

తర్వాతి సినిమాని సైతం ఇదే నిర్మాణ సంస్థతో చేయనున్నారు జ్ఞానసాగర్. యాక్షన్ జానర్‌లోనే రానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం హీరో సహా మిగిలిన విషయాలపై చర్చలు సాగుతున్నాయి. టైటిల్‌తో పాటు ఇతర వివరాలతో త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

- జ్ఞానసాగర్ ద్వారక