సమంత జ్ఞాన పాఠాలు
వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించేందుకు పర్యటనలు చేసే నటీనటుల్లో స్టార్ హీరోయిన్ సమంత ఒకరు. ఆ టూర్ అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడంలోనూ సమంత ముందుంటుంది. అలా సమయం చిక్కినప్పుడల్లా కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌ను సందర్శించి అక్కడ ధ్యానం చేయడం ఈ అమ్మడికి అలవాటు. గత ఏడాది ఈశా ఫౌండేషన్ సందర్శనకు వెళ్లినప్పటి ఫొటోలను తాజాగా మరోసారి సోషల్ మీడియాలో పంచుకున్న సమంత తత్వం, జ్ఞానం గురించిన పాఠాలు కూడా పోస్టులో రాసుకొచ్చింది. ‘చాలా మంది గురువు, మెంటార్ కోసం వెతుకుతుంటారు.
మనల్ని సరైన మార్గంలో నడిపించటం ద్వారా జీవితంలో వెలుగులు నింపే వ్యక్తిని కనుగొనడం కన్నా మించిందేదీ ఉండదు. రోజువారీ జీవితంలో ఎన్నో సంఘటనలు మనపై ప్రభావం చూపుతాయి. అందులో ఏది సాధారణమో, ఏది అసాధారణమో గ్రహించడం కష్టమే. ఆ జ్ఞానం కావాలంటే కూడా ప్రపంచంలో వెతకాలి. అంతేకాదు ఆ జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడమూ ముఖ్యమే’ అని రాసుకొచ్చింది సమంత. ఇదిలా ఉండగా, సమంత కొంత విరామం తర్వాత ‘మా ఇంటి బంగారం’లో నటిస్తోంది. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’పై ఆమె నిర్మాణ సారథ్యంలో రూపొందిస్తున్న తొలి సినిమా ఇది.






