అది వ్యక్తిగత గోప్యతకు భంగమే
న్యూఢిల్లీ: వ్యక్తిగత సంభాషణలను కూడా ప్రసారం చేయడంపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని సామాజిక మాధ్యమాల వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ప్రేక్షకులకు అందివ్వాలని చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు.. అభిమానులు, క్రికెటర్ల మధ్య దూరాన్ని పెంచుతాయని రోహిత్ అన్నాడు. తన సంభాషణను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్‌ను కోరినా.. వారు అది పట్టించుకోలేదని వాపోయాడు.
కోల్‌కతా, ముంబై మ్యాచ్ సందర్భంగా అభిషేక్ నాయర్‌తో రోహిత్ ముచ్చటించిన విషయాలను స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. అందులో.. ‘అన్నా, నాదేముంది.. ఇదే చివరిది’ అని రోహిత్ అన్నట్లు వినిపించింది. దీంతో రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీని వీడుతున్నాడని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ కెమెరామాన్‌లతో దయచేసి ఆడియో కట్ చేయండి.. ఇప్పటికే ఒక వీడియో నన్ను చిక్కుల్లో పడేసింది అని చెప్పిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.






