10 July, 2026 | 6:54 PM

ఒక్కరినే నిందించడం సరికాదు

14-12-2024 12:00 AM

సంధ్య థియేటర్ దుర్ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై సినీ పరిశ్రమ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పుష్ప ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. దీనిపై అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి, సురేఖ దంపతులు వెళ్లారు. ఆ తరువాత నాగబాబు, రానా దగ్గుబాటి వెళ్లారు. ఈ ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్పందించారు.

నందమూరి బాలకృష్ణ : అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అన్యాయం. ఇలా చేయడం సరికాదు. మేము అల్లు అర్జున్‌కి అండగా ఎల్లప్పుడూ ఉంటాం. 

 నాని : సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వాధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలి. అదొక దురదృష్టకర, హృదయ విదారక ఘటన. దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. ఈ విషయమై ఒక్కరినే నిందించడం సరికాదు.

 వరుణ్ ధావన్ : ఈ ఘటన బాధాకరమే కానీ భద్రతా పరమైన అంశాలను నటీనటులొక్కరే చూసుకోలేరు. జాగ్రత్త గా ఉండాలని మాత్రమే సూచిస్తారు. ఇలాంటి ఘటనల్లో ఒక్కరినే నిందించడం అన్యాయం.

 రష్మిక మందన్నా : ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నా. ఈ ఘటన హృదయాన్ని కలచివేస్తోంది. ఒక వ్యక్తిని నిందించడం సరికాదు.

 అనిల్ రావిపూడి : సంధ్య థియేటర్‌లో జరిగిన హృదయ విదారక ఘటన మెరుగైన భద్రతా ప్రోటోకాల్ ఆవశ్యకత ను సూచిస్తోంది. తన కంట్రోల్‌లో లేని అంశంపై అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదు.

 గోపిచంద్ మలినేని : సంధ్య థియేటర్ ఘటన నిజంగా హృదయవిదారకమే. దానికి ఒక నటుడిని నిందిస్తూ అరెస్ట్ చేయడం సరికాదు. పబ్లిక్ రక్షణ అనేది అందరి బాధ్యత.