11 July, 2026 | 9:35 PM

అద్భుతమైన క్రైం థిల్లర్ ‘అవే కళ్లు’

14-12-2024 12:00 AM

‘అవే కళ్లు’ చిత్రం 1967 డిసెంబర్ 14న విడుదలైంది. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో క్రైం థిల్లర్ మూవీగా రూపొందింది. కృష్ణ, కాంచన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఉత్కంఠభరిత చిత్రంలో గుమ్మడి, రాజనాల, పద్మనాభం, రమణారెడ్డి, నాగభూషణం, గీతాంజలి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏవీఎం సంస్థ నిర్మించింది. పూర్తి స్థాయి రంగుల్లో విడుదలైన తొలి క్రైం చిత్రం ఇది. తెలుగులో వచ్చిన క్రైం థ్రిల్లర్ల జాబితాలో మొదటి వరుసలో ఉంటుందీ సినిమా. ఈ సినిమా తొలుత అంతగా విజయవంతం కానప్పటికీ ఆ తరువాత విడుదలలో బాగా ఆడి వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను ఏవీఎం వారు ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తమిళంలో సినిమా పేరు అదే కణగళ్. తమిళ సినిమాలో రవిచంద్రన్ కృష్ణ పాత్ర పోషిస్తే, పద్మనాభం పాత్రను నగేష్ పోషించారు. కాంచన, గీతాంజలి రెండు భాషల్లోనూ నటించారు. సినిమాలో ‘డుం డుం గంగిరెద్దు దాసరోడొచ్చాడు, మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భలే భయమన్నది’ వంటి చిరకాలం నిలచిన హిట్ పాటలు ఉన్నాయి. కేవలం కళ్లను ఆధారం చేసుకుని ఒక క్రైంను ఎలా ఛేదించారనే ఆసక్తికర కథాంశంతో సినిమా రూపొందింది. గీతాంజలి తల్లి పాత్రను కనకం పోషించారు. పద్మనాభం, గీతాంజలికి పెద్దగా కథలో స్థానం లేకపోయినా హాస్య సన్నివేశాలతో వీరు బాగా ఆకట్టుకున్నారు.