అక్రమ వలసలపై వివాదం
భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకూ మరింతగా క్షీణిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారుతున్నాయి. షేక్ హసీనా సర్కార్ కుప్పకూలాక రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇటీవల ఐపీఎల్‌లో బంగ్లా క్రికెటర్లపై భారత్ నిషేధం విధించగా, భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరించిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా అక్రమ వలసల విషయమై వివాదం చెలరేగింది.
బంగ్లాదేశ్‌కు చెందిన 20 మంది అక్రమ వలసదారులను వారి సొం త దేశానికి సాగనంపామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బంగ్లా.. భారత హైకమిషనర్ పవన్ బాధేను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. కాగా, ఒకవేళ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సర్కార్ ఏ ర్పాటైతే శరణార్థుల సమస్య బంగ్లాదేశ్‌కు తలనొప్పిగా మారొచ్చని బంగ్లాదేశ్ ఎంపీ అక్తర్ హోసేన్ ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి భారత్ మధ్య అక్రమ వలసల సమస్య ఈనాటిది కాదు. 1971కి ముందు నాటి తూర్పు పాకిస్థాన్‌లో పాక్ అరాచకాలతో మొద లైన ఈ వలసలు ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, సైనిక తిరుగుబాట్ల కారణంగా ఊపందుకున్నాయి. ఇరుదేశాల మధ్య 4 వేల కిలోమీటర్ల సరిహద్దు ఉండటంతో వీటిని ఆపడం కష్టమవుతోంది. మరోవైపు అధికారికంగా భారత్‌కు వస్తున్నవారిలో కొందరు ఇక్కడే ఉండిపోతున్నారు. వా రంతా సరిహద్దు రాష్ట్రాలైన అసోం, పశ్చిమ బెంగాల్‌లోనే తిష్టవేస్తుండటం ఆయా రాష్ట్రాలకు సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలోనే అక్రమ వలసల కారణంగా స్థానికులు మైనారిటీలుగా మారుతున్నారని, జనాభాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్తూ హిమంత బిశ్వశర్మ దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చేశారు. అంతేకాదు, ఎన్నార్సీని అమలు చేసి సరైన పత్రాలు లేని 19 లక్షల మంది గుర్తించారు కూడా.
అయితే, అక్రమ వలసదారుల పేరిట కొందరు స్థానికులపై ఉక్కుపాదం మోపారనే ఆరోపణలున్నాయి. కాగా, వీరిని బంగ్లాదేశీయులుగా గుర్తించేందుకు బంగ్లా సర్కార్ నిరాకరిస్తుండటంతో ఈ సమస్య మళ్లీ మొదటికొస్తున్నది. అందుకే అక్రమ వలసదారులను వారి పద్ధతిలోనే రాత్రికిరాత్రి సరిహద్దులు దాటించాలని బీజేపీ నేతలు చెప్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ ఈ సమస్యకు ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి.






