ప్రభుత్వ సేవల్లో నాణ్యతకు నిదర్శనంగా నిలవాలి
హెచ్పీ గ్యాస్ సరఫరాలో ఉత్తమ అవార్డు గ్రహీత అనంతుల లక్ష్మీనారాయణను అభినందించిన జిల్లా కలెక్టర్ అంకిత్
పాల్వంచ, జూలై 19, (విజయక్రాంతి): పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్పీ గ్యాస్ కార్యాలయం, పాల్వంచ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ హెచ్పీసీఎల్ గ్యాస్ కంపెనీ సౌత్ సెంట్రల్ జోన్ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ అవార్డు అందుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
202526 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు గృహావసర గ్యాస్ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయడం, 99.9 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయడం, 95 శాతం వినియోగదారుల గృహాల్లో భద్రతా తనిఖీలు నిర్వహించడం, 88 శాతం సురక్ష పైప్ లు మార్చడం వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం వంటి అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు హెచ్పీసీఎల్ గ్యాస్ కంపెనీ సౌత్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
విజయవాడలోని హెచ్పీసీఎల్ రిటైల్ రీజనల్ కార్యాలయంలో ఈనెల 17న జరిగిన సౌత్ సెంట్రల్ జోన్ సేల్స్ ఆఫీసర్ల సమీక్ష సమావేశంలో హెచ్పీసీఎల్ సౌత్ సెంట్రల్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ దేబేష్ పురోహిత్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఉమాపతి, ఆశీష్ సింఘాల్, విజయవాడ రీజనల్ మేనేజర్ కోమర శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ మేనేజర్ రాహుల్ సింగ్, ఖమ్మం ఏరియా సేల్స్ మేనేజర్ల చేతుల మీదుగా అనంతుల లక్ష్మీనారాయణ ఈ ఉత్తమ అవార్డును అందుకున్నారు.
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతుల లక్ష్మీనారాయణను జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ త్రినాథ్ బాబులు అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు తప్పకుండా లభిస్తుందని అన్నారు.
వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తూ ప్రభుత్వ సంస్థలకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని అనంతుల లక్ష్మీనారాయణ ను కొనియాడారు కార్యాలయ సిబ్బంది రాజులపూడి రజిత, కేలోత్ నరేష్, దుర్గం రాజాబాపు పాల్గొన్నారు.






