30 April, 2026 | 3:22 AM

టాక్సిక్ అందుకే వాయిదా

30-04-2026 01:51 AM

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. వచ్చే జూన్ 4వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం రిలీజ్ డేట్ మారనుంది. త్వరలోనే ఈ కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాకాన్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. “మేము సాధారణంగా తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, మరికొన్ని సినిమాలు అసలు మనం సినిమాను ఎందుకు ప్రేమించామో గుర్తు చేస్తాయి.

‘టాక్సిక్’ అలాంటి ఒక ప్రయాణమే. సినిమాకాన్లో మా చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత.. అక్కడ వచ్చిన స్పందనను చూసిన తర్వాత.. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది” అని చిత్ర కథానాయకుడు యశ్ సోషల్‌మీడియాలో విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి యష్, గీతూ మోహన్‌దాస్ రచన చేయగా.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు నటించారు. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.