పీడకల అయితే బాగుండు!
‘లగ్గం’ హీరోయిన్ ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో లీకైందంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ప్రగ్యా ఉన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై ప్రగ్యా స్పందించారు. టెక్నాలజీని వాడుకుని తనను దారుణంగా చిత్రీకరించారని.. ఇదొక పీడకల అయితే బాగుండు అని ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. ‘ఇప్పటికీ నమ్మలేకున్నా. ఇదంతా పీడకల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీని మంచికి వినియోగించాలి కానీ జీవితాల్ని నాశనం చేసేందుకు కాదు.
విపరీత ఆలోచనలున్న దుర్మార్గులు ఏఐ సాయంతో అసహ్యకరమైన వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏ అమ్మాయికీ ఇలాంటి దారుణ పరిస్థితి రాకూడదు. ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అని ప్రగ్యా రాసుకొచ్చారు. దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆమె సైబర్ క్రైం పోలీసులకు ట్యాగ్ చేశారు. నెటిజన్లు ప్రగ్యాకు ధైర్యం చెబుతున్నారు. ఈమె ‘వరళరు ముఖ్యం’ అనే తమిళ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేసిన మీదట ‘లగ్గం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.






