8 August, 2026 | 1:14 AM

నాదే తప్పు!

08-08-2026 12:00 AM
  1. మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో నేరం అంగీకరించిన ఉదయ్‌కృష్ణారెడ్డి
  2. విచారణలో బిగ్ ట్విస్ట్
  3. పోలీసుల ప్రవర్తనపై జడ్జికి ఫిర్యాదు

రంగారెడ్డి, ఆగస్టు 7(విజయక్రాంతి): నగరంలో తీవ్ర కలకలం రేపిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి వేధింపుల కేసులో శుక్రవారం సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం ఉదయ్ కృష్ణారెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ముందు జరిగిన విచారణలో తాను సదరు మహిళా ట్రైనీ అధికారిణిని వేధించినట్లు ఉదయ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

తనతో సన్నిహితంగా ఉన్న బాధితురాలు, వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడా న్ని తట్టుకోలేకనే ఆమెను మానసికంగా, భౌతికంగా వేధించినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు సహించలేని బాధితురా లు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలై చివరి వారంలో అతడిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.  విచారణలో పోలీసుల ప్రవర్తనపై జడ్జికి ఉదయ్ కృష్ణారెడ్డిని ఫిర్యాదు చేశారు.

పోలీసు కస్టడీ గడువు ముగియడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరి చారు. ఈ సందర్భంగా కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విచారణ సమయంలో పోలీసులు ‘నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో నన్ను ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు’ అని జడ్జికి విన్నవించారు. ఉదయ్ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కోర్టు, సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో ప్రశ్నించడంపై తగిన వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.

మరో వైపు, ఉదయ్ నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు కస్టడీని మరింత పెంచాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ కొనసాగనుంది. అనంతరం చర్లపల్లి జైలుకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు తరలించారు.