8 August, 2026 | 1:08 AM

షాపుల స్థానంలో ఫ్లెక్సీలు!?

08-08-2026 12:00 AM

కేసముద్రం, ఆగస్టు 7 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల రోడ్ల విస్తరణ కోసం ప్రధాన రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న షాపులు, గుంచీలు తొలగించారు. 80 అడుగుల మేర రోడ్లను విస్తరించడానికి అడ్డుగా ఉన్న అనేక షాపులను, ఇండ్లను, అలాగే చిరు వ్యాపారులకు సంబంధించిన షట్టర్లను తొలగించారు. దీనితో దాదాపు 500 మందికి పైగా తమ షాపులను, ఇండ్లను, షెడ్లను, గుంచీలు నామరూపాలు లేకుండా పోయాయి.

ఇందులో సుమారు 200 మంది వరకు తాము నిత్యం నిర్వహించే వృత్తి, ఇతర ఉపాధి అవకాశాలకు సంబంధించిన షాపులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఫలితంగా గతంలో తమ షాపులో ఉన్న ప్రదేశాల్లో తమ కస్టమర్లు వస్తే తమ కొత్త పని ప్రదేశాన్ని చూపే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలా కేసముద్రం మున్సిపాలిటీలో అనేకచోట్ల గతంలో ఉన్న షాపులకు సంబంధించిన యజమానులు తమ సెల్ ఫోన్ నంబర్లు, కొత్తగా తాము షాపు ఏర్పాటుచేసిన ప్రదేశాన్ని, వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి అక్కడికి వెళ్తున్నారు. 

ప్రత్యామ్నాయం చూపలేదు

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ కోసం స్ట్రీట్ వెండర్స్ షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రత్యామ్నయం చూపడం లేదని పలువురు చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 మందికి పైగా పూర్తిగా రోడ్లను ఆధారంగా చేసుకుని జీవిస్తుండగా, రోడ్ల విస్తరణ పేరుతో తమ షాపులను, గుంచీలను ఉన్నఫలంగా తొలగించాలని అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నయం చూపలేదని, వరంగల్, ఖమ్మం, ఇటీవల మహబూబాబాద్ లో సైతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేశారని, అలాగే స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి కల్పించలేదన్నారు. దీనితో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోగా, మరి కొంతమందికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి

కేసముద్రం పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు వెంటనే స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పేరుతో పేదల ఉపాధి అవకాశాలను తొలగించవద్దు. మున్సిపల్ పరిధిలో ఇటీవల తొలగించిన షాపుల యజమానులతో వెండర్స్ కమిటీ ఏర్పాటు చేసి, చికెన్, మటన్, ఫిష్ , వెజిటబుల్, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలి. స్ట్రీట్ వెండర్స్ కి ప్రత్యేకంగా కాంప్లెక్స్ ఏర్పాటు చేసి, అందులో వారికి అవకాశం కల్పించి ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలి. 

 సుదర్శన్, 

సెలూన్ షాపు యజమాని