దుర్వాసనతో ఏగలేకపోతున్నాం సార్లూ
- రోగాలు బారిన పడే అవకాశం
- పలు గ్రామాల ప్రజల ఆవేదన
- పౌల్ట్రీస్‌తో అవస్థలు పడుతున్న ప్రజలు
భిక్కనూర్, ఆగస్టు 7(విజయ క్రాంతి): దుర్వాసనతో ఏగలేకపోతున్నాం సార్లు... రోగాల బారిన పడి అనారోగ్యాల పాలవు తున్నాం... ఆదుకోండి సార్లు అంటూ కామారెడ్డి జిల్లా లోని భిక్కనూర్ మండలం ఇస్సానపల్లి, కంచర్ల, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, భిక్కనూర్ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమీపంలో ఉన్న కొన్ని పౌల్ట్రీస్ కారణంగా ప్రజలు నిత్యము దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన, ఈగలు, దోమల బెడద, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో జీవనం దుర్భరంగా మారిందని వాపోతున్నారు.
సాయంత్రం తర్వాత భరించలేని దుర్వాసన
ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు పౌల్ట్రీ నుంచి భరించలేని దుర్వాసన వస్తోందని, ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఈగలు, దోమలతో ప్రజల అవస్థలు
పౌల్ట్రీ వ్యర్థాల కారణంగా ఈగలు అధికంగా పెరిగి ఇళ్లలోకి చేరుతున్నాయని, ఆహార పదార్థాలపై వాలడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అలాగే గతంలో లేని విధంగా దోమల బెడద పెరిగిందని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యంపై తీవ్ర ఆందోళన
పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వాయు కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు చెబుతు న్నారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పౌల్ట్రీలో కాలుష్య నియంత్రణ చేపట్టాలి
పౌల్ట్రీ నుంచి దుర్వాసన, ఈగలు, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కాలుష్య నియంత్రణ మండలి, సంబంధిత శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా శాశ్వత సమస్యను పరిష్కరించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
- పాలమాకుల జ్యోతి,
సర్పంచ్, కాచాపూర్,
భిక్కనూరు మండలం, కామారెడ్డి జిల్లా






