జగన్.. మీకు ప్యాలెస్‌ల పిచ్చేంటి?
- ఆంధ్రప్రదేశ్ మీ జాగిరి కాదు?
‘ఎక్స్’ ద్వారా ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపాటు
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ‘మీకు ఈ ప్యాలెస్‌ల పిచ్చేంటి? ఏపీ మీ పూర్వికుల జాగిరి కాదు? మీ ధన దాహానికి అంతు లేదా? అని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 42 ఎకరాలను రూ.వెయ్యి నామమాత్రపు ఫీజుతో జగన్‌మోహన్‌రెడ్డి 33 ఏళ్లకు లీజుకు రాయించుకున్నా రని, రూ.600 కోట్ల విలువైన భూముల్లో రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కట్టేందుకు సిద్ధమయ్యారన్నారని దుయ్యబట్టారు.
జగన్ మోహన్‌రెడ్డి లీజుకు రాయించుకున్న భూమిని 4,200 మంది నిరుపేదలకు పంచవచ్చన్నారు. అలా ఒక్కొక్కరికీ సెంట్ భూమి చొప్పున అప్పగించవచ్చన్నారు. రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వొచ్చన్నారు. ఇప్పటికే వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయం కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన జగన్‌మోహన్ రెడ్డి, ఇప్పుడు మంత్రి లోకేశ్ పోస్ట్‌కు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.






