7 August, 2026 | 10:19 AM

టిడబ్ల్యూజెఎఫ్ అచ్చంపేట తాలూకా అధ్యక్షుడిగా జంగయ్య

07-08-2026 09:39 AM

ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ఏకగ్రీవ ఎంపిక

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని హామీ

అచ్చంపేట,(విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) అచ్చంపేట తాలూకా అధ్యక్షుడిగా ఉప్పునుంతల మండలానికి చెందిన మెట్రో ఈవినింగ్ రిపోర్టర్ బింపాకుల జంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ చింకరహోల్ ఫారెస్ట్ పరిధిలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ, జిల్లా నాయకుల సమక్షంలో జంగయ్యకు నియామక పత్రం అందజేసి సన్మానించారు. అనంతరం అచ్చంపేట తాలూకా నూతన కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా సయ్యద్ షికిల్, శేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. ఆంజనేయులు, కోశాధికారితో పాటు పలువురిని వివిధ బాధ్యతలకు నియమించారు.

సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ, ఫెడరేషన్ బలోపేతానికి నూతన కమిటీ సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. నూతన అధ్యక్షుడు బింపాకుల జంగయ్య మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాలూకా పరిధిలోని జర్నలిస్టులను ఐక్యంగా తీసుకెళ్లి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ, ఫెడరేషన్ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు చక్కర రామచంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, ప్రధాన కార్యదర్శి సయ్యద్ షఫి, నాయకులు చారగొండ వెంకటేష్, బాదం పరమేష్, నవీన్‌తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.