బోనాల ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్
19 ఏళ్ల యువకుడు మృతి..... మరో ఇద్దరికి గాయాలు
నర్సాపూర్, ఆగస్టు 7: బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి 19 ఏళ్ల యువకుడు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజామున నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మల్పర్తి హర్షవర్ధన్ (19) శివాలయం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా, ఫ్లెక్సీ కట్టేందుకు ఉపయోగిస్తున్న ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలింది.
దీంతో హర్షవర్ధన్‌కు తీవ్ర విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్‌కు గురై గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోనాల పండుగకు ముందు యువకుడు మృతి చెందడంతో నర్సాపూర్‌లో విషాదం నెలకొంది.






