2 June, 2026 | 3:25 AM

మనోళ్ల సత్తా

02-06-2026 02:46 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల 

  1. టాప్- 5 ర్యాంకుల్లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులే
  2. మోహిత్ శేఖర్ శుక్లాకు 4వ ర్యాంకు.. కుచి సందీప్‌కు 5వ ర్యాంకు 
  3. క్వాలిఫై అయిన వారిలో ఎక్కువ మంది మద్రాస్ జోన్‌కు చెందిన వారే.. 
  4. బీహార్ విద్యార్థి శుభంకుమార్‌కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): దేశంలోని 23 ఐటీటీల్లో బీటెక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన మెహిత్ శేఖర్ శుక్లా ఆల్ ఇండియా 4వ ర్యాంకు సాధించాడు. మోహిత్ టాప్ -5 ర్యాంకుల్లో చోటు దక్కించుకోవడమే కాకుండా ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్ గాను నిలిచాడు.

హైదరాబాద్ నగరానికి చెందిన మరో విద్యార్థి కుచి సందీప్ ఆల్ ఇండియా 5వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. టాప్--౫ ర్యాంకుల్లో ౨ ర్యాంకులు హైదరాబాద్ విద్యార్థులకే దక్కడం గమనార్హం. అలాగే, మెడిశెట్టి నాగ సహర్ష ఆల్ ఇండియా 9వ ర్యాంక్, వెల్దుర్తి హర్షిత్ ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించారు. 

 జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బీహార్‌లోని గయకు చెందిన శుభంకుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (ఏఐఆర్ 1) కైవసం చేసుకున్నాడు. ఇదే విద్యార్థి అంతకుముందు జేఈఈ మెయిన్స్‌లోనూ 100 పర్సంటైల్ సాధించడం విశేషం. అలాగే, జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో కబీర్ చిల్లర్ అనే విద్యార్థి 329 మార్కులతో రెండో ర్యాం క్, జతిన్ చాహర్ అనే 319 మార్కులతో మూడో ర్యాంక్ సాధించారు.

బాలికల్లో ఆరోహి దేశ్‌పాండే టాపర్‌గా నిలిచింది. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన ఈ విద్యార్థిని 280 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 77వ ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది అర్హత సాధించిన వారిలో అబ్బాయిలే అధికంగా ఉన్నారు. ఈసారి 46,773 మంది అబ్బాయిలు అర్హత సాధించగా, బాలికలు కేవలం 10,107 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా పీడబ్ల్యూడీ కోటాలో 887 మంది క్వాలిఫై అయ్యారు. 

మద్రాస్ జోన్ నుంచే ఎక్కువమంది...

ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.87లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.79లక్షల మం ది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 56,880 మంది అర్హత సాధించారు. మొత్తం గా ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి రికార్డుస్థాయిలో విద్యార్థులు అర్హత సాధించారు.

మొత్తం ౭ జోన్లు ఉండగా, మద్రాస్ నుంచి ఈసారి రికార్డుస్థాయిలో 12,389 మంది వి ద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఐఐటీ మ్ర దాస్ జోన్ పరిధిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి.

అడ్వాన్స్‌డ్‌లో టాప్ 10, టాప్ 100లోనూ మనోళ్లు సత్తాచాటారు. మిగతా జోన్లతో పోలిస్తే మద్రాస్ నుంచి టాప్ -500లో ఎక్కువ మంది నిలిచారు. టాప్ 10లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి ముగ్గరు విద్యార్థులున్నారు. టాప్ 100లో 35 మం ది, టాప్ 200లో 73 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే కావడం గమనా ర్హం. టాప్ 300లో108 మంది, టాప్ 400 లో 146, టాప్ 500లో 174 మంది ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి అర్హత సాధించారు. 

ఆరు విడుతల్లో జ్యోసా కౌన్సెలింగ్

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల కావడంతో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం నుంచి జోసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆరు విడతల్లో సీట్ల భర్తీ ఉంటుంది. నాలుగు విడతల సీట్ల కేటాయింపు తర్వాత తుది విడుతలో ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీట్లను భర్తీ చేయనుండగా, ఆరో విడుతలో కేవలం ఎన్‌ఐటీల్లోని సీట్ల భర్తీ ఉంటుంది. ఈ నెల 13 మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇదే నెల 30న రెండో విడత, జూలై 6న మూడో విడత, జూలై 10న నాలుగో విడత, జూలై 16న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎన్‌ఐటీల్లో సీట్ల భర్తీకి జూలై 16 నుంచి 24 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది.

రోజుకు 6- 8 గంటలు చదివా: శుభంకుమార్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్

మా స్వస్థలం గయ. నేను రోజుకు 6- 8 గంటలు చదివాం. నేనేమీ పుస్తకాలతో కుస్తీ పట్టలేదు. చదివనంత సేపు మాత్రం శ్రద్ధగా చదివా. నాకు మా సోదరి ఆదర్శం. ఆమె ప్రస్తుతం ఐఐటీ పాట్నాలో చదువుతున్నది. ఆమెను చూసే నేను ఐఐటీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం

ఒత్తిడి తగ్గేందుకు బ్యాడ్మింటన్ ఆడా: కబీర్ చిల్లర్, ఆల్ ఇండియా 2వ ర్యాంకర్

మాది గుర్గావ్. నేను ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించా. అడ్వాన్స్‌డ్‌లో కేవలం ఒక్క మార్కుతో మొదటి ర్యాంక్ కోల్పోయా. మొదటి ర్యాంకర్ శుభం నా స్నేహితుడే. ఇద్దరం కోటా కోచింగ్ సెంటర్లలో కలిసి శిక్షణ పొందాం. ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రతి రోజు సాయంత్రం మేం ఇద్దరం బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. ఏకధాటిగా గంటల కొద్ది చదవడం నాకు ఇష్టం ఉండదు.

రోజుకు 8-10 గంటలు చదివా: మెహిత్ శేఖర్ శుక్లా, ఆల్ ఇండియా 4వ ర్యాంకర్ 

పరీక్ష రాయగానే మంచి ర్యాంకు వస్తుందని ఊహించా. 300పై చిలుకు మార్కులొస్తాయని ముందే అంచనా వేసుకున్నా. చదివేటప్పుడు వాట్సాప్ తప్ప సోషల్ మీడియా జోలికి వెళ్లలేదు. జేఈఈ కోసం రోజుకు 8--10 గంటలు చదివా.-------------------------------------------------------------------- ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాలనేది నా ఆకాంక్ష. భవిష్యత్తు గురించి ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. ఇంజినీరింగ్ తర్వాత ఉద్యోగంలోనే చేరతా. అమ్మానాన్నలిద్దరూ ఇస్రో శాస్త్రవేత్తలు. వారిద్దరి ప్రోత్సాహం, సహకారంతోనే మంచి ర్యాంకు సాధించా.