ఎవడబ్బ సొమ్మాయెరో తెలంగాణ!
టీ చిరంజీవులు
*తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు దాటిన ఈ సమయంలో ఒక మౌళిక ప్రశ్న ముందుకు వస్తోంది. తెలంగాణ సాధన కోసం పోరాడిన బహుజనులకు నిజంగా న్యాయం జరిగిందా? రాష్ట్ర సంపద, అధికారాలు, అవకాశాలు ప్రజలందరికీ సమానంగా చేరాయా? లేక కొద్దిమంది దోపిడీ ఆధిపత్య వర్గాలకే పరిమితమయ్యాయా? బంగారు తెలంగాణ ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే శూన్యమే కనిపిస్తుంది. తెలంగాణను నిర్మించింది బహుజనులైతే, తెలంగాణ ఫలాలను అనుభవిస్తున్నది దోపిడీ ఆధిపత్య వర్గాలేననే స్పష్టమవుతుంది. త్యాగాలు బహుజనులవి- భోగాలు ఆధిపత్య కులాలవి. సామాజిక న్యాయం ఇక్కడ పూర్తిగా ఖూనీ కాబడింది.
*ప్రస్తుత ముఖ్యమంత్రి స్వయంగా 2026 నాటికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని ప్రకటించినప్పటికీ, గత రెండున్నర ఏళ్లలో 60 వేలకు మించి భర్తీ చేయలేకపోయారు. గత రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా ఒక్క ఉపాద్యాయ పోస్ట్‌ను భర్తీ చేయలేదు. ఇంకో వైపు ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు వచ్చి రిజర్వేషన్స్ లేకుండ ఆధిపత్య కులాల వారితో నింపి బహుజనుల పొట్టకొడుతున్నాయి.
*ఇక నీళ్ల పేరున నిధుల దోపిడీ 2004 నుంచి నిరాటంకముగా కొనసాగుతూనే ఉంది. జలయజ్ఞం కాస్త ధనయజ్ఞంగా మారింది. గత దశాబ్దకాలంలో మామూలు కాంట్రాక్టర్లు కూడా బిలియన్ డాలర్ల ధనవంతులుగా మారారు. తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచి, పాలకులు, కాంట్రాక్టర్లు--, అధికారులు మాత్రం కమిషన్లతో బిలియనీయర్లు అవుతున్నారు. ఈ సొమ్ము ఎవరిది ? ఇదేనా తెలంగాణ అభివృద్ధి? ఇదేనా బహుజనుల త్యాగాల ఫలితం?
*రైతు సంక్షేమం, పారిశ్రామిక ఇన్సెంటివ్స్, అభివృద్ధి పేర్లతో ప్రభుత్వ నిధులన్నీ ఆధిపత్య కులాల చేతుల్లోకి చేరుతుంటే, బహుజనులు మాత్రం నిరాశలో, నిస్సహాయతలో మునిగిపోవడం తప్ప మరే దారిలేకుండా అణగదొక్కబడ్డారు. ఖజానా ఖాళీ అని మనకు చెప్తూ కాంట్రాక్టర్లకు మాత్రం పెద్ద ఎత్తున దోచిపెడుతున్నారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో.. దోపిడీదారులు బిలియనీర్లుగా --- ఆధిపత్య కులాలు తెలంగాణను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
ప్రభుత్వ నిధులు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన బదులు, రాజకీయంగా బలమైన వర్గాల ఆర్థిక సామ్రాజ్యాలను పెంచే సాధనంగా మారాయి. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడుతుంటే, మరోవైపు ఆధిపత్య కులాలకు చెందినవారు బిలియనీర్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దీని ఫలితంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగి, సామాన్య ప్రజల జీవితాలు దుర్బరంగా, అస్థిరంగా మారాయి.
తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భౌగోళిక పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కాదు. అది దశాబ్దాల పోరాటం, వేలాది మంది యువత త్యాగాలు, లక్షలాది మంది బహుజనుల ఆశయాల ఫలితం. ‘నీళ్లు, నిధులు, నియామకాలు‘ అనే నినాదంతో సాగినది తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న అసలు ఆకాంక్ష సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, స్థానిక వనరులపై స్థానిక ప్రజల హక్కు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు దాటిన ఈ సమయంలో ఒక మౌళిక ప్రశ్న ముందుకు వస్తోంది. తెలంగాణ సాధన కోసం పోరాడిన బహుజనులకు నిజంగా న్యాయం జరిగిందా? రాష్ట్ర సంపద, అధికారాలు, అవకాశాలు ప్రజలందరికీ సమానంగా చేరాయా? లేక కొద్దిమంది దోపిడీ ఆధిపత్య వర్గాలకే పరిమితమయ్యాయా? బంగారు తెలంగాణ ఏర్పడిందా?
ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే శూన్యమే కనిపిస్తుంది. తెలంగాణను నిర్మించింది బహుజనులైతే, తెలంగాణ ఫలాలను అనుభవిస్తున్నది దోపిడీ ఆధిపత్య వర్గాలేననే స్పష్టమవుతుంది. త్యాగాలుబహుజనులవి- భోగాలు ఆధిపత్య కులాలవి. సామాజికి న్యాయం ఇక్కడ పూర్తిగా ఖూనీ కాబడింది.
జల దోపిడీ
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కృష్ణాగోదావరి నదుల జలాలతో తెలంగాణ సస్యశ్యామలమై, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలు పండుతాయని ఉద్యమ కాలంలో ప్రజలంతా కలలుగన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి? నీళ్లు రాలేదు- కన్నీళ్లు వచ్చాయి, కానీ పాలకులకు మాత్రం కమిషన్లు వచ్చా యి. ప్రాజెక్టుల ఖర్చులను విపరీతంగా పెంచి ప్రజలను నిండా ముంచారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ క్రింది ప్రాజెక్టులు.
అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత రెండున్నర సంవత్సరాలలో కాంట్రాక్టర్లకు రూ.లక్ష కోట్లు చెల్లించినదని మరో రూ.90 వేల కోట్ల టెండర్లను పిలిచిందని పత్రికల్లో చూస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను ముందుకు తెస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటికే మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ ఉంది. ఆ బ్యారేజీలో ఏర్పడిన లోపాలు, పగుళ్లను సరిచేసి వినియోగంలోకి తీసుకురావడం గురించి ఆలోచించకుండా, మళ్లీ తుమిడిహట్టి వైపు దృష్టి మళ్లించడం వెనుక ఏమి కారణాలు ఉన్నాయో ప్రజల కు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల డబ్బుతో నిర్మించిన ఆస్తులను పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టుల వైపు వెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అలాగే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా సాగు నీటి ప్రాజెకట్స్ పైన ఎన్నోసార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉదాహరణకు 1983లో మొత్తం 20 నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించి 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు .కాని పరిస్థితి ఏమిటంటే 22 -23 నాటికి నీటిపారుదల ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూe 206977 కోట్లు . మొదట అంచనా రూe 102388/. అంచనా వ్యయం పై అదనపు ఖర్చు రూe 104589 / కోట్లు. నేటికి ఈ ప్రాజెకట్స్ పూర్తి కాలేవు . అలాగే మూసీ నది పునరుజ్జీవనం పేరుతో లక్ష కోట్ల రూపాయల వరకు వ్యయం చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటిస్తోంది.
భారత్ ఫ్యూచర్ సిటీ పేరు తో 4 వ సిటీ ని ప్రకటించి ప్రజా ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టు తున్నారు .ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఉందని చెబుతు , మరోవైపు ఇంత భారీ స్థాయిలో అప్పులు చేసి ప్రాజెక్టులు చేపట్టడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ లక్షల కోట్ల అప్పుల భారం చివరకు ఎవరి భుజాలపై పడబోతోంది? వాటి వల్ల ప్రజలకు, ముఖ్యంగా బీసీలు, మరియు ఇతర బహుజన వర్గాలకు కలిగే ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటి? ఈ అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇక నీళ్ల పేరున నిధుల దోపిడీ 2004 నుంచి నిరాటంకముగా కొనసాగుతూనే ఉంది. జలయజ్ఞం కాస్త ధనయజ్ఞంగా మారింది. గత దశాబ్దకాలంలో మామూలు కాంట్రాక్టర్లు కూడా బిలియన్ డాలర్ల ధనవంతులుగా మారారు. తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచి, పాలకులు, కాంట్రాక్టర్లు--, అధికారులు మాత్రం కమిషన్లతో బిలియనీయర్లు అవుతున్నారు. ఈ సొమ్ము ఎవరిది ? ఇదేనా తెలంగాణ అభివృద్ధి? ఇదేనా బహుజనుల త్యాగాల ఫలితం ?
ప్రకృతి సంపద అందరిదే, కానీ కమిషన్ల కోసం సింగరేణి సంస్థను గత పన్నెండు సంవత్సరాలుగా ఎలా బరితెగించి దోచారో ఈ మధ్య మీడియా లొ రోజూ బయటపడుతోంది. ఒడిశాలోని నైని బొగ్గు గని సింగరేణికి సంబంధించినదే. ఆ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి పాలకులు, వ్యాపారవేత్తలే కాదు , మీడియా యజమానులు కూడా రంగంలోకి దిగారు! ఇది కేవలం దోపిడీ కాదు ఇది రాష్ట్ర సంపదపై దాడి! ప్రభుత్వ నేతలకు వేల కోట్ల భారీ కమిషన్లు . అలాగే గనులు, ఇసుక విచ్చల విడిగా దోచుకుని పాలకవర్గాలు ప్రకృతి సంపదను ధ్వంసం చేసి తెలంగాణను శిథిల శల్యం చేస్తున్నారు.
తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో అనేక అవినీతి కుంభకోణాలకు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కమిషన్లు ఏర్పాటుచేయగా, విచారణలు కొనసాగుతున్నాయి. అలాగే దామరచర్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలపై కూడా పలు అనుమా నాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేస్తామని చెప్పి చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లలోనూ భారీ అవినీతి జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను ఇష్ట రీతిలో తమ అనుయాయులకు కట్ట బెట్టుకున్నారు.
నిధులు-- నిరాశ
(28 లక్షల కోట్ల ఖర్చు.. బీసీలకు మాత్రం చిల్లర!) గడచిన పన్నెండు సంవత్సరాలలో రాష్ట్ర బడ్జెట్ ద్వారా సుమారు 21 లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. బడ్జెట్‌కు బయట అప్పుల తీసుకువచ్చి మరో 7 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. మొత్తం మీద రాష్ట్రం ఖర్చుచేసిన ప్రజాధనం సుమారు 28 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈ భారీ ఖర్చులో జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలకు ఎంత చేరింది? బీసీ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసిన మొత్తం కేవలం 28713.62 వేల కోట్ల రూపాయలు మాత్రమే.(బీసీ హాస్టల్స్, ఉపకార వేతనముల కొరకు )
36 కులాలతో కూడిన ఎంబీసీ కార్పొరేషన్‌కు గత పదేళ్లలో 4,900 కోట్ల రూపాయలు కేటాయిస్తే, విడుదల చేసింది కేవలం రూ.601.50 కోట్లు. ఖర్చు చేసింది మాత్రం 20.99 కోట్ల రూపాయలే. ఇది ప్రభుత్వాలకు బలహీన వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధి. అలాగే చేనేత, జౌళి శాఖకు రూ.3,033.67 కో ట్లు కేటాయించి, రూ.2,696.11 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. కానీ ఇందులో రూ.2,148.58 కోట్లు కేవలం బతుకమ్మ చీరలకే వెళ్ళాయి. చేనేతల నిజమైన సంక్షేమం, అభివృద్ధి కోసం గత పన్నెండు సంవత్సరాలలో ఖర్చు చేసిన మొత్తం కేవలం రూ.540 కోట్ల రూపాయలే. ఇతర కుల సమాఖ్యల పరిస్థితి కూడా ఇదే దయనీయ స్థాయిలో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంవత్సరానికి రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తామని కామారెడ్డిలో హామీ ఇచ్చి 2024 కేవలం రూ.2,068 కోట్లు వసతి గృహాలకు , మెస్ ఛార్జి లకు, ఉపకార వేతనాలకు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే 2025 సంవత్సరానికి కూడా అంతే ఖర్చు చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్న 12 బీసీ కుల ఫెడరేషన్‌లకు అదనంగా 9 కుల ఫెడరేషన్‌లు ఏర్పాటు చేసింది. 2024- ఈ కుల ఫెడరేషన్ లకు రూ.2,200 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అలాగే 2025 కూడా ఈ 21 కుల ఫెడరేషన్‌లకు రూ.2,150 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
బీసీలకు బడ్జెట్లో గత 12 సంవత్సరాలలో రూ.65,546.24 కోట్లు కేటాయించారు. ఖర్చు మాత్రం రూ.28,713.62 కోట్లు మాత్రమే. ఇందులో ఆర్థిక పేద వర్గాలుకు సంబందించిన 2,200 కోట్లు కూడా ఉన్నాయి. బీసీలకు ఇవ్వకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించి బీసీలను ముంచింది రూ.36,832.62 కోట్లు. సంక్షేమ పథకాలు అన్నికలిపినా గత పుష్కర కాలంలో బీసీలకు చేరిన మొత్తం రెండులక్షల కోట్ల రూపాయలు కూడా దాటలేదు. మరి జనాభాలో 56.33 % శాతం ఉన్న బీసీలు ఈ స్థాయి నిధుల పంపిణీతో ఎప్పటికి పేదరికం నుంచి బయటపడతారు? వారి జీవితాల్లో వెలుగు ఎప్పుడు వస్తుంది?
రైతు సంక్షేమం, పారిశ్రామిక ఇన్సెంటివ్స్, అభివృద్ధి పేర్లతో ప్రభుత్వ నిధులన్నీ ఆధిపత్య కులాల చేతుల్లోకి చేరుతుంటే, బహుజనులు మాత్రం నిరాశలో, నిస్సహాయతలో మునిగిపోవడం తప్ప మరే దారిలేకుండా అణగదొక్కబడ్డారు. ఖజానా ఖాళీ అని మనకు చెప్తూ కాంట్రాక్టర్లకు మాత్రం పెద్ద ఎత్తున దోచిపెడుతున్నారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో.. దోపిడీదారులు బిలియనీర్లుగా --- ఆధిపత్య కులాలు తెలంగాణను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన బదులు, రాజకీయంగా బలమైన వర్గాల ఆర్థిక సామ్రాజ్యాలను పెంచే సాధనంగా మారాయి. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడుతుంటే, మరోవైపు ఆధిపత్య కులాలకు చెందినవారు బిలియనీర్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దీని ఫలితంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగి, సామాన్య ప్రజల జీవితాలు దుర్బరంగా, అస్థిరంగా మారాయి.
నియామకాలు
బీసీ యువతకు నిరుద్యోగ శిక్ష. రిజర్వేషన్స్ - తెలంగాణ వచ్చిన తర్వాత 42% దేవుడెరుగు గాని స్థానిక సంస్థలలో ఉన్న 34% ఉన్న రిజర్వేషన్లు కాస్త 23% తగ్గాయి . దీనికి కోర్టులతో బాటు పాలకులు కూడా కారణం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం 202425లో తెలంగాణ నిరుద్యోగ రేటు 5%, ఇది జాతీయ సగటు 3.2% కన్నా ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ గుడిసె ప్రాంతాల్లో నివసిస్తున్న బీసీ యువతలో నిరుద్యోగం, అర్థనిరుద్యోగం విపరీతంగా ఉంది.
ఉద్యమ కాలంలో తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చిన పాలకులు, గత పన్నెండు సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగ విరమణ వయసును పెంచుతూ, నిరుద్యోగ యువత జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ఇప్పటికీ అనేక శాఖల్లో ఖాళీలు అలాగే ఉన్నాయి. ఈ ఆలస్యం వల్ల అత్యధికంగా నష్టపోతున్నది బీసీ యువతే.
డిగ్రీలు, పీజీలు చేతుల్లో పెట్టుకుని నిరుద్యోగిగా తిరుగుతున్నారు. గిగ్ వర్కర్స్‌గా మారుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి స్వయంగా 2026 నాటికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని ప్రకటించినప్పటికీ, గత రెండున్నర ఏళ్లలో 60 వేలకు మించి భర్తీ చేయలేకపోయారు. గత రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా ఒక్క ఉపాద్యాయ పోస్ట్‌ను భర్తీ చేయలేదు. ఇంకో వైపు ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు వచ్చి రిజర్వేషన్స్ లేకుండ ఆధిపత్య కులాల వారితో నింపి బహుజనుల పొట్ట కొడుతున్నాయి.
42 శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో పాలకులు బీసీలను నమ్మించి మోసం చేశారు. ఇది బీసీ సమాజంలో తీవ్ర నిరాశను, అసంతృప్తిని పెంచింది. ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని బహిర్గతం చేసింది. గ్లోబలైజేషన్ పేరుతో చేతివృత్తులు నాశనం అయ్యాయి. కానీ వాటికి ప్రత్యామ్నాయ ఉపాధి మాత్రం కల్పించలేదు. బహుజనులు దినసరి కూలీలుగా మారిపోయారు.
మీకే అన్ని, మాకు మాత్రం నిరుద్యోగమే. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మీరే, పార్లమెంట్లో ఎంపీలు మీరే, నామినేటెడ్ పోస్టుల్లో మీరే, ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరే, లాభదాయక పదవులు మీకే, కాంట్రాక్టులు మీకే, పరిశ్రమలు మీకే, వ్యాపారాలు మీకే, సినిమా రంగం మీకే, ఏ రంగంలో చూసినా మీరే, మాకు మాత్రం నిరుద్యోగమే! రాజకీయ ప్రాతినిధ్యం జనాభాకు తగ్గ హక్కు లేదు- బీసీలు జనాభాలో మెజారిటీ అయినప్పటికీ, స్థానిక సంస్థలు, శాసనసభ, పరిపాలనా వ్యవస్థల్లో వారి ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఇక ఇప్పుడు ఉద్భవిస్తున్న ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ ఎవడబ్బ సొమ్మయింది?
ఈ రాష్ట్రం దొరలది కాదు. ఇది ప్రజలది..
ముఖ్యంగా బీసీ బహుజనుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఆ త్యాగాలకు న్యాయం జరగకపోతే, తెలంగాణ భావన శుష్క నినాదంగా మిగిలిపోతుంది. ఉద్యమాలు బహుజనులవి.. ఊరేగింపులు దొరలవి-. ఉద్యమాల సమయంలో రోడ్లపై నిలబడి పోరాడింది బీసీ /బహుజన యువత. లాఠీచార్జీలు భరించింది, కేసులు ఎదుర్కొన్నది, ప్రాణ త్యాగాలు చేసింది బహుజన బిడ్డలు. కానీ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రశ్నించిన వారిపై దమనకాండ కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారినా, ప్రజాస్వామ్యంపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రమే కాదు, ప్రత్యేకంగా సామాజిక న్యాయానికి ప్రమాదకరమైన పరిణామం.
ప్రత్యేక రాష్ట్ర ఫలాలు అందినవ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచినా, ఆశించిన ఫలితాలు దక్క లేవు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో అప్పులు భారీగా పెరిగాయి. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అవినీతి ఆరోపణలు, స్కామ్ లు వినిపిస్తున్నాయి. చివరకు పేదలకు పంపిణీ చేసిన పశువుల పథకాల అమలులో కూడా అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఏ రంగాన్ని పరిశీలించినా గత పన్నెండు సంవత్సరాల్లో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దోపిడీ దారుల అడ్డాగా మారింది. తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు. సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు ఏ మాత్రం మెరుగు పడలేవు, ఇంకా దిగ జారీ పోయా యి. స్వయం ఉపాధి పథకాలు లేవు, సబ్సిడీలపైన ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.
రైతు సంక్షేమం, రైతు భరోసా, ఋణ మాఫీ పేరిట భూములున్న సంపన్న వర్గాలకే లబ్ది , భూమి లేని 25 లక్షల నిరుపేద కుటుంబాలకు అందింది శూన్యం. పరిశ్రమలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు, విద్య, వైద్యం, మీడియా వంటి కీలక రంగాల్లో ఇప్పటికీ ఆధిపత్య కులాల ప్రాబల్యమే. ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం అసలే లేదు. ఒకవైపు స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరోవైపు జీఓ ఎంఎస్ నెం. 7 ద్వారా విద్యార్థుల భవిష్యత్‌పై గుదిబండ మోపుతున్నారు. విద్యను హక్కుగా కాకుండా భారంగా మార్చే ఈ విధానాలు పేద, బహుజన విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలను దెబ్బతీస్తున్నాయి.
కాంట్రాక్టుల అవినీతి సొమ్ముతో భూములను భారీ ధరలకు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ రంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫలితంగా భూముల ధరలు అమాంతం పెరిగి, సామాన్య ప్రజలకు సొంత ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయడం అందని ద్రాక్షగా మారింది.
శ్రమ దోపిడీ పెరిగింది. ఏ రంగంలో చుసినా బహుజనుల బతుకులు చిన్న భిన్నమయ్యాయి. రాష్ట్ర సంపద సృష్టి బహుజనులదైతే, అందులో వారి వాటా పెద్ద గుండు సున్నా. చివరకు రిటైర్ అయినా ఉద్యోగులకు కూడా వారికి రావాల్సిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇది నేటి తెలంగాణ.
గత పన్నెండు సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ దోపిడికి గురి కాబడింది.అమర వీరుల ఆశయాలను పాలకులు తుంగలో తొక్కి రాష్ట్రాన్ని ప్రైవేట్ ఎస్టేట్‌గా మార్చేసారు.
మరి మన కర్తవ్య మేమిటి, చూస్తూ కూర్చోవడమేనా, ఈ దోపిడిని అరికట్టాల్సినటువంటి అవసరం లేదా? ఈ నేపథ్యంలోనే హిస్సా, ఇజ్జత్, హుకుమత్ (వాటా, గౌరవం, అధికారం) అనే భావన తెలంగాణ సమాజంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా, నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో భాగస్వామ్యం కావాలనే ఆకాంక్ష బహుజన వర్గాల్లో పెరుగుతోంది.
గత పన్నెండు ఏళ్లలో తెలంగాణ, ఆంధ్ర పెత్తందార్ల దోపిడీకి అడ్డగా మారిపోయింది.మార్వాడీలు, స్థానికేతరుల రాజ్యంగ మారి పోయింది. ముల్కిలకు ( స్థానికులకు) మొండిచేయి మిగిలిoది. తెలంగాణ అస్థిత్వమునకు ప్రమాదం ఏర్పడింది.ఈ తెలంగాణ కోసమేనా మేము త్యాగం చేసింది అని అమరవీరులుపై నుంచి శోకిస్తున్నారు.
కొత్త రాజకీయ దిశ అవసరం
ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది కొత్త రాజకీయ దిశ, ఈ దోపిడీ నుంచి విముక్తి , మరో సామజిక విప్లవం. బీసీలకు/బహుజనులకు సంఖ్యాబలం ఉంది, కానీ అది ఇంకా రాజకీయ శక్తిగా మారలేదు. ఆ సంఖ్యాబలాన్ని సంఘటిత శక్తిగా మార్చాల్సిన సమయం ఇది. సామాజిక న్యాయం, 42% రిజర్వేషన్ల అమలు, వనరుల సమాన పంపిణీ, రాజ్యాధికారం ఇవే బీసీ ఉద్యమానికి కేంద్రబిందువులుగా మారాలి. ఇది వ్యక్తులపై పోరాటం కాదు. వ్యవస్థపై పోరాటం.. తెలంగాణను దోపిడీదారుల అడ్డాగా మారకూడదు. సామాజిక తెలంగాణ సాధించే వరకు మన పోరాటం ఆగకూడదు. ఆ రోజే తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి. ఆ రోజే తెలంగాణ తల్లికి నిజమైన ప్రశాంతి.
జై తెలంగాణ.. జై ఫూలే.. జై అంబేద్కర్
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్, హైదరాబాద్.
పాలమూరు రంగారెడ్డి
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
2017లో పరిపాలన అనుమతులు మంజూరు చేసినప్పుడు అంచనా వ్యయం రూ.27,513 కోట్లు, జూరాల బ్యాక్ వాటర్ నుంచి శ్రీశైలంకు సోర్స్ మార్చి 2020లో సీడబ్ల్యూసీకి డీపీఆర్ అంచనా వ్యయం రూ.55,086 కోట్లకు పెంచినారు. ప్రస్తుత అంచనా వ్యయం సుమారు రూ.85,000కోట్లు. ప్రాజెక్ట్ పూర్తిఅయ్యే నాటికి (2030) అది రూ.1,35,000 కోట్లు కావచ్చును అని వారే అభిప్రాయపడుతున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.26,262 కోట్లు ఖర్చు పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7,000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఈరోజు వరకూ పాలమూరు జిల్లాలకు ఒక చుక్క నీరు కూడా రాలేదు! కాని రూ. 32,622 కోట్లు ఖర్చు ఇప్పటికే జరిగిపోయింది.
మొదటి అంచనా వ్యయం దాటిపోయింది. ఇప్పుడు ఇంకా లక్ష కోట్లు కావాలంటున్నారు. విచిత్ర మేమిటంటే కేంద్ర పర్యావరణ ఇతర శాఖల అనుమతులు లేకపోయినా పనులు కొనసాగుతున్నాయి. ఎందుకింత ఆత్రుత ? కమిషన్ల కొరకు కాకా పోతే తప్పా. రెండు ప్రభుత్వాల ధోరణి ఒకటే -ప్రాజెక్ట్‌ల పేరా ఎడాపెడా అప్పులు చేయటం, అందినంత కమిషన్లు దండుకోవటం. ప్రాజెక్టు 90 టీఎంసీల నీటితో 12.3 లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం, కానీ పాలకుల అంతు లేని ధనదాహం దీనిని పూర్తి కానిస్తుందా అనే ప్రశ్న ప్రజల మనసుల్లో మెదులుతునే ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టు మొట్టమొదట ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద రూ.35,000 కోట్ల వ్యయంతో 2012 13లో ప్రారంభించబడింది . కానీ ప్రాజెక్టు డిజైన్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వలన ప్రాజెక్టు వ్యయం అంచనా మార్చి 2016 నాటికి రూ.71,436 కోట్లకు చేరింది. అలాగే మార్చి 2022 నాటికి రూ.1,10,248 కోట్లకు అంచనా వ్యయం పెరిగిపోయింది.
2014 నాటికి తుమ్మిడి హట్టి వద్ద జరిగిన రూ.6 వేల కోట్ల పనులు, 15 వందల కోట్ల టన్నెల్ పనులు మొత్తం రూ.7,500 కోట్లు వృథా ఖర్చుగా మిగిలిపోయింది. 2023 నవంబర్ నాటికి రూ.89,775 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.ఇంకా ప్రాజెక్టు పూర్తి కాలేదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా అధిక వడ్డీకి బ్యాంకు రుణాలు తీసుకొచ్చారు. ఇష్టమైన రీతిలో ప్రాజెక్టు వ్యయం పెంచారు. దీనివలన పెట్టుబ డులపై ప్రతిఫలం (కాస్ట్ బెనిఫిట్ నిష్పత్తి) తగ్గి ప్రాజెక్ట్ వ్యయం దుబారాగా మారిపోయింది.
90 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు, కాని నీళ్లు మాత్రం ప్రజలకు అందలేదు! మేడిగడ్డ బరాజ్ కట్టిన కొద్ది రోజుల్లోనే పగుళ్లు చూపాయి. కోట్ల ప్రజాధనం మట్టిలో కలిసింది. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యం 2 టిఎంసి నుంచి 3 టీఎంసీకి పెంచి రూ.27 వేల కోట్లు అదనపు భారాన్ని మోపారు. సామర్థ్యం పెంచకుండా ఇదే డబ్బును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు చేసి ఉంటే పాలమూరుెేరంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి అయి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామల మయ్యేవి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి నవంబర్ 23 వరకు 1.83 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. కానీ కొత్తగా సృష్టించిన లేదా స్థిరపరిచిన ఆయకట్టు నామ మాత్రమే.
(మూలం: సాగునీటి శాఖ మంత్రివర్యులు
శ్రీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గారి పాలమూరు-రంగారెడ్డి
ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్,
అసెంబ్లీలో తేదీ:02-01-2026)
రాష్ట్ర సంపదపై దాడి!
ప్రకృతి సంపద అందరిదే, కానీ కమిషన్ల కోసం సింగరేణి సంస్థను గత పన్నెండు సంవత్సరాలుగా ఎలా బరితెగించి దోచారో ఈ మధ్య మీడియాలో రోజూ బయటపడుతోంది. ఒడిశాలోని నైని బొగ్గు గని సింగరేణికి సంబంధించినదే. ఆ కాంట్రాక్టులు దక్కించుకోవ డానికి పాలకులు, వ్యాపారవేత్తలే కాదు, మీడియా యజమానులు కూడా రంగంలోకి దిగారు! ఇది కేవలం దోపి డీ కాదు ఇది రాష్ట్ర సంపదపై దాడి! ప్రభుత్వ నేతలకు వేల కోట్ల భారీ కమిషన్లు. అలాగే గనులు, ఇసుక విచ్చల విడిగా దోచుకుని పాలకవర్గాలు ప్రకృతి సంపదను ధ్వంసం చేసి తెలంగాణను శిథిల శల్యం చేస్తున్నారు.






