అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్: జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడంపై ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనను శాంతింపజేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యవసర సమావేశం కోసం ఆయనను ఢిల్లీకి పిలిపించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు జీవన్‌రెడ్డిని ఢిల్లీకి రప్పించే బాధ్యతను అప్పగించారు. అటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
తనకు తెలియకుండా తన రాజకీయ ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా పార్టీలో పనిచేసి అవమానంగా భావించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులను రంగంలోకి దించి శాంతింపజేసింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ కూడా జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినా ఫలితం లేకపోయింది. తొలుత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన చేసినా.. ఆ తర్వాత పార్టీలోనే కొనసాగుతానని మీడియాకు వెల్లడించారు.






