జీవో 252 రద్దు చేయాలి
డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడేషన్లు ఇవ్వాలి
జర్నలిస్టు సంఘాల డిమాండ్
33 జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
హైదరాబాద్‌లో ఉద్రిక్తత.. నేతల అరెస్టు
అందరికీ న్యాయం చేస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): జర్నలిస్టుల గుర్తింపు కార్డుల జారీలో ప్రభుత్వం తెచ్చిన నూతన జీవో 252 ను వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయ లోకం కదం తొక్కింది. తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ పిలుపు మేరకు 33 జిల్లాల్లో కలం కవాతు నిర్వహించారు. కలెక్టరేట్లను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జర్నలిస్టుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వేలాదిగా తరలివచ్చిన జర్న లిస్టులను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ తోపులాట జరిగింది. తమను లోపలికి అనుమతించాలంటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ నేతృత్వంలో జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. అక్రిడేషన్లు రద్దు చేస్తారా.. సిగ్గు సిగ్గు, జీవో 252ను వెంటనే రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. శాంతియుతంగా నిరస న తెలుపుతున్న నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టయిన వారిలో ఆస్కాని మారుతి సాగర్, ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, టీఈఎంజేయూ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, ఐజేయూ నేత అవ్వారి భాస్కర్, హైదరాబాద్ ఇంచార్జి నవీన్ కుమార్ ఉన్నారు. వీరిని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రజాపాలన అంటే ఇదేనా:
అల్లం నారాయణ
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన జర్నలిస్ట్ నేతలను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘జర్నలిస్టుల సంక్షేమానికి గత కేసీఆర్ ప్రభుత్వం 42 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. నాటి జీవో 239 ద్వారా డెస్క్, ఫీల్డ్ అనే తేడా లేకుండా అందరికీ సమాన గుర్తింపునిచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం జీవో 252 పేరుతో డెస్క్ జర్నలిస్టులను రెండో శ్రేణి పౌరులుగా చూస్తోంది. అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి నష్టం లేదు. కేవలం జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికే ఈ కుట్ర జరుగుతోంది. ప్రజాస్వామికంగా నిరసన తెలిపితే అరెస్టులు చేస్తారా ఇదేనా ప్రజాపాలన’ అని ప్రశ్నించారు. ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మీడియా కార్డులు వద్దు
మరోవైపు డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో లక్డీకాపూల్ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా డీజేఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె మస్తాన్ మాట్లాడుతూ.. ‘రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే పత్రిక నడు స్తుంది. మమ్మల్ని విడదీసి చూడొద్దు. మాకు కొత్తగా తెచ్చిన మీడియా కార్డులు వద్దు. పాత పద్ధతిలోనే అక్రిడేషన్ కార్డులు కావాలి’ అని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్, సినిమా, బిజినెస్ డెస్క్ జర్నలిస్టులకు, కార్టూనిస్టులకు కూడా కార్డులు పునరుద్ధరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనకు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్యూజే, ఎస్జాట్ సంఘాలు మద్దతు తెలిపాయి.
ఆందోళన వద్దు : మంత్రి పొంగులేటి
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళనలు మిన్నంటడంతో ప్రభుత్వం స్పందించింది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని డీజేఎఫ్టీ, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ‘జర్నలిస్టులెవరూ ఆందోళన చెందవద్దు. డెస్క్ జర్నలిస్టులకు కూడా గతంలో లాగే అక్రిడేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. అందరికీ న్యాయం చేస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చారు.






