28-12-2025 01:51:25 AM
విడుదల చేస్తున్న కేంద్రం
మందుల బిల్లులు చెల్లించకపోవడంతో బయటపడ్డ వ్యవహారం
సొమ్మొకరిది.. సొకొకరిది అనే సామెత తెలంగాణను పరిపా లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. సొంత ఆదా య వనరులేకాదు.. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా తమ ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాలకు, ఇతర అవసరాలకు మళ్లించి వాడుకుంటోంది. కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులు, కార్మికుల సంక్షేమంలో భాగంగా కేంద్రం అమలుచేస్తున్న ఈఎస్‌ఐ పథకానికి అందిస్తున్న కేంద్రం నిధులను కూడా తన అవసరాలకు మళ్లిస్తోంది. కనీసం ఈఎస్‌ఐ ఆసుపత్రు లు, డిస్పెన్సరీలకు కొనుగోలు చేస్తున్న మందులు, డ్రగ్స్, సర్జికల్స్‌కు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో అసలు విషయంపై ఆరా తీయ గా.. కేంద్రం ఠంచనుగా ఈఎస్‌ఐకి విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): వాస్తవానికి గతంలో ప్రతియేటా కేంద్రం నుంచి సుమారు రూ. 500 కోట్ల వరకు నిధులు ఈఎస్‌ఐకి వచ్చేవి. ఈ నిధులతో మందులు, ఎక్విప్‌మెంట్, స్టేషనరీ, ఫర్నిచర్, సర్జికల్స్, ఇంజెక్షన్లు.. ఇలా ఈఎస్‌ఐకి సంబంధించి నిర్వహణ అన్నీ చూసే వారు. అయితే ఉద్యోగుల నియామకం, వారి జీతభత్యాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ లాంటివి రాష్ట్ర ప్రభుత్వం చూసేవి.
అయితే ఇందులో అనేక రకాలుగా నిధుల దుర్వినియోగం అవుతుందని, పైగా ప్రతి రాష్ట్రంలో నూ కేంద్ర ప్రభుత్వంలోని కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రధాన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ లాంటివి (ఈఎస్‌ఐసీ) ఏర్పాటు చేయడంతో.. బడ్జెట్‌ను తగ్గించారు. దీనితో గడిచిన కొద్ది సంవత్సరాలుగా ప్రతియేటా రూ. 250 కోట్ల వరకు నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. ఈ నిధులతో మందు లు, సర్జికల్స్, డ్రగ్స్ లాంటివి కొనుగోలు, ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల నిర్వహణతోపాటు.. సుమారు 20 శాతం నిధుల తో డిస్పెన్సరీల అద్దెలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాల లాంటివి చెల్లిస్తుంటారు.
ఈ నిధులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలోని ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌కు విడుదల చేస్తారు. అయితే ఈ నిధుల పరిధిలో చేసే కొనుగోళ్ళకు పే అండ్ అకౌంట్ నుంచిగానీ, ట్రెజరరీ నుంచిగానీ ప్రభుత్వం బిల్లులను చెల్లిస్తుంది.
రెండేండ్లుగా లెక్కాపత్రం లేదు..
అయితే గడిచిన రెండేండ్లుగా కేంద్రం నుంచి ప్రతియేటా వస్తున్న సుమారు రూ. 250 కోట్లకు సరైన లెక్కా పత్రం లేదని ఈఎస్‌ఐ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఈఎస్‌ఐని పర్యవేక్షించే డైరెక్టరేట్ కార్యాలయం లో నెలకొన్న పరిస్థితులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక అవసరాల నేపథ్యంలో కేంద్రం నుంచి వస్తున్న నిధులను తమ సొంత పథకాలకు, ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్టుగా ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ చెప్పడమే కాదు.. వస్తున్న నిధులు, ఖర్చులను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
2024 ఆర్థిక సంవత్సరంలో మొ త్తం రూ. 241.80 కోట్ల నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యాయి. ఇందులో 19.4.2024 నాడు (చలానా నెం. 6400184266) రూ. 43.80 కోట్లు, తేది 18.4.2024 నాడు (చలానా నెం. 6400184272) రూ. 99 కోట్లు, అలాగే 30.10.2024 నాడు రూ. 99 కోట్లతో మొత్తం... రూ. 241.80 కోట్లు విడుదలయ్యాయి. అలాగే 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 8.5.2025 నాడు రెండు చలానాలుగా మొత్తం రూ. 164.87 కోట్లు విడుదలయ్యాయి. ఇలా ప్రతియేటా ఠంచనుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదలవుతునే ఉన్నాయి.
పైగా 2025 ఆర్థిక సంవత్సరంలో సరఫరా చేసిన మందులకు కూడా బిల్లులుకూడా ప్రభుత్వం చెల్లించలేదు. దీనితో 29.8.2025 నాడు ప్రధాన మంత్రికి మందుల సరఫరాదారులు మరో లేఖ రాశారు. ఇందులో కేంద్రం నుంచి విడుదల అవుతన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత అవసరాలకు, పథకాలకు మళ్ళించుకుంటూ.. ఈఎస్‌ఐ పరిధిలో చెల్లించాల్సిన బిల్లులను చెల్లించడం లేదంటూ స్పష్టంగా ఆరోపించారు. ఇలా గడిచిన రెండు సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ. 85 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయని వారంటున్నారు.
కేంద్రం నుంచి ఠంచనుగా నిధులు వస్తున్నాయి. ఇందులో నుంచే బిల్లులు చెల్లించాలి. కానీ బిల్లుల బకాయిలు మాత్రం ఏటా పెరిగిపోతున్నాయి. మరి కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏమవుతున్నా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనితో కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు, పథకాలకు వాడుకుంటుందని అందుకే బిల్లులు సకాలంలో విడుదల చేయడం లేదంటూ వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం కనపడుతోంది. మరి అది కాదంటే.. కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఎటువేపు వెళ్ళాయనేది రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి.
బిల్లులు రాకపోవడంతో.. అయితే 2024 సంవత్సరంలో మందులు, డ్రగ్స్, సర్జికల్స్ లాంటివి సరఫరాచేసినవారికి చెల్లించాల్సిన సుమారు రూ. 25 కోట్ల బిల్లుల చెల్లింపు గురించి ఎందరు అధికారుల చుట్టూ తిరిగినా.. ఆఖరికి కార్మిక శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి విన్నవించినా.. బిల్లులు మాత్రం ఇవ్వలేదు. దీనితో ఇలా మందులు సరఫరా చేసే సప్లయర్స్ అసోసియేషన్ ‘ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్’ తరఫున సాక్షాత్తు ప్రధాన మంత్రికి 1.7.2024 నాడు, తిరిగి 28.9.2024 నాడు లేఖలు రాశారు.
కేంద్రం నుంచి ఈఎస్‌ఐకి ఠంచనుగా నిధులను విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించడం లేదంటూ వారు వాపోయారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వాన్ని రిమార్క్స్ అడగడంతో.. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 కోట్ల బిల్లులు చెల్లించామంటూ ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అయితే ఆ బిల్లులను ఈరోజు వరకుకూడా చెల్లించకపోవడం గమనార్హం.