ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం నుండి జోగులాంబ పాదయాత్ర ప్రారంభం
ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని.. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వీర తెలంగాణ సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టామని వీర తెలంగాణ సమితి అధ్యక్షుడు వి.విక్రం రెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఇంద్రవెల్లి గిరిజన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఇంద్రవెల్లి నుండి జోగులాంబ వరకు ఆత్మగౌరవం, ఐక్యత, అభ్యుదయ అనే నినాదంతో పదిహేను వేల కిలోమీటర్ల యాత్రను ప్రారంభించారు.
ఇంద్రవెల్లి నుండి ముత్నూర్ వరకు పాదయాత్ర నిర్వహించి ముత్నూర్ లోని కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముత్నూర్ నుండి కేస్లాపూర్ నాగోబా ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి గ్రామంలో గ్రామ పటేల్ మెస్రం వెంకట్రావుతో మాట్లాడి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విక్రం రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని 13 ఏళ్లు దాటిన నేటికీ అభివృద్ధి పథంలో వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. యువత,మహిళలు, రైతులు, మధ్యతరగతి ప్రజలను రాజకీయాల్లోకి ఆహ్వానించి వారిని జాగో తెలంగాణ యాత్రలో చైతన్యవంతులు చేసే విధంగా తమయాత్ర 15 వేల కిలోమీటర్లు కొనసాగుతుందని గుర్తు చేశారు. పాదయాత్రలో ప్రతి గ్రామానికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో స్వయంగా చూసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకు వస్తామన్నారు. ఆయనతోపాటు వివేక్, అమూల్య, సంధ్యన తదితరులు పాల్గొన్నారు.






